ఆ చెప్పు జాగ్రత్త పవన్.. 2024లో పనికొస్తుంది..
మాజీ మంత్రి కొడాలి నాని మాత్రం తనదైన శైలిలో పవన్ పై సెటైర్లు వేశారు. ఆ చెప్పు జాగ్రత్తగా దాచుకోవాలని, దానితో ముందు ముందు చాలా పని ఉంటుందని పవన్ కి సూచించారు.
తనని ప్యాకేజీ స్టార్ అనేవారిని చెప్పుతో కొడతానంటూ ఇటీవల పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ లోనే తనకాలి చెప్పు తీసి చూపించడం, తోలు తీస్తా, నార తీస్తానంటూ హెచ్చరిండచం సంచలనంగా మారింది. ఈ చెప్పు ఘటనపై ఇప్పటి వరకూ చాలామంది స్పందించారు. తమకీ చెప్పులున్నాయని, తామూ వాటిని చూపించగలమని.. ఇలా రకరకాలుగా బదులిచ్చారు. కానీ మాజీ మంత్రి కొడాలి నాని మాత్రం తనదైన శైలిలో పవన్ పై సెటైర్లు వేశారు. ఆ చెప్పు జాగ్రత్తగా దాచుకోవాలని, దానితో ముందు ముందు చాలా పని ఉంటుందని పవన్ కి సూచించారు.
చంద్రబాబు కోసం పవన్ చిల్లర వేషాలు వేస్తున్నాడని మండిపడ్డారు కొడాలి నాని. పవన్ చూపించిన చెప్పును జాగ్రత్తగా దాచి పెట్టుకోవాలని అన్నారు. 2024 ఎన్నికల కౌంటింగ్ రోజు.. దాచిన ఆ చెప్పుతో పవన్ తనని తాను కొట్టుకుంటారని, అదే సమయంలో తన దుస్థితికి కారణమైన చంద్రబాబుని కూడా కొట్టాలని సూచించారు నాని. ఇప్పటికైనా పవన్ బ్రహ్మానందం డైలాగులు మాని సక్రమమైన మార్గంలో వెళ్లాలని చెప్పారు.
అందుకే ప్యాకేజ్ స్టార్ అంటాం..
పవన్ కి ఆత్మాభిమానం కంటే ప్యాకేజీ ముఖ్యమని మండిపడ్డారు కొడాలి నాని. తల్లిని తిట్టిన వారితోనే ఆయన కలిసి నడుస్తున్నాడని మండిపడ్డారు. అందుకే ప్రజలతో పాటు తాము కూడా 'పీకే'ని ప్యాకేజ్ స్టార్ అనుకుంటున్నామని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఊడిగం చేయడానికే జనసేన ఏర్పడిందని విమర్శించారు. వంద మంది పవన్ కల్యాణ్ లు కలిసొచ్చినా, జగన్ చిటికెన వేలు కూడా కదల్చలేరని అన్నారు నాని. ఒక్క సీటులో కూడా పోటీ చేయకుండా.. ఇతర పార్టీలకు మద్దతు తెలిపిన ఏకైక పార్టీ జనసేన అని ఎద్దేవా చేశారు నాని. ప్రొడ్యూసర్లకు కాల్షీట్లు ఇచ్చినట్లు, చంద్రబాబుకి పవన్ రాజకీయ కాల్షీట్లు ఇస్తున్నాడని, బాబుని సీఎం చేయడమే పవన్ లక్ష్యమని అన్నారు.