Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు-పవన్ ఇద్దరినీ ఒకేసారి దెబ్బకొడుతున్నారా..?

గంటా పార్టీమారటం టీడీపీకి షాక్ కొట్టినట్లుకాదు. ఎందుకంటే చాలాకాలంగా పార్టీతో అంటీముట్టనట్లుగానే ఉంటున్నారు. కాకపోతే గంటాతో పాటు మరో నలుగురు పార్టీని వదిలేయటమే పార్టీకి షాక్.

చంద్రబాబు-పవన్ ఇద్దరినీ ఒకేసారి దెబ్బకొడుతున్నారా..?
X

ఉత్తరాంధ్ర రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయా..? జరుగుతున్న ప్రచారం చూస్తుంటే అందరిలోనూ ఇదే అనుమానం పెరిగిపోతోంది. నిజమెంతో తెలీదుకానీ మాజీ మంత్రి, వైజాగ్ ఉత్తరం నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరబోతున్నట్లు విపరీతంగా ప్రచారం జరుగుతోంది. గంటాతో పాటు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు మీసాల గీత, అప్పలనాయుడు, సీనియర్ నేతలు అజయ్, సన్యాసిపాత్రుడు వైసీపీలో చేరబోతున్నారట.

నిజానికి వైసీపీలో చేరాలని గంటా చాలాకాలంగా ప్రయత్నిస్తున్నా సాధ్యంకావటంలేదు. అయితే మారిన పరిస్ధితుల్లో గంటాను చేర్చుకోవటానికి జగన్మోహన్ రెడ్డి కూడా సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ప్రచారం జరుగుతున్నట్లుగా నిజంగానే గంటాతో పాటు మరో నలుగురు నేతలు వైసీపీలో చేరితే చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కు షాక్ కొట్టినట్లే అనుకోవాలి. గంటా పార్టీమారటం టీడీపీకి షాక్ కొట్టినట్లుకాదు. ఎందుకంటే చాలాకాలంగా పార్టీతో అంటీముట్టనట్లుగానే ఉంటున్నారు. కాకపోతే గంటాతో పాటు మరో నలుగురు పార్టీని వదిలేయటమే పార్టీకి షాక్.

ఇదే సమయంలో గంటా జనసేనలో చేరుతారనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఆర్థిక, అంగ బలాల్లో గంటా చాలా బలమైన నేత. కాపుల్లో మంచిపట్టుంది. జనసేనలో గంటా చేరితే పార్టీకి ఉపయోగమనే అందరూ అనుకున్నారు. ఇవన్నీ ఇలాగుంటే కాపుల కోసం తొందరలోనే ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటవుతుందని దానికి గంటానే సారథ్యం వహిస్తారని కూడా అనుకున్నారు.

అయితే తాజాగా పెరిగిపోతున్న ప్రచారం ప్రకారం గంటా అండ్ కో వైసీపీలో చేరబోతున్నారు. గంటాను పార్టీలోకి చేర్చుకుంటారని ఇప్పటికీ కొందరు అధికారపార్టీ నేతలు నమ్మటంలేదు. ఇదే సమయంలో ఉత్తరాంధ్ర ఇన్చార్జి వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీలో ఎవరైనా చేరవ‌చ్చనే ఓపెన్ ఆఫర్ ఇచ్చిన తర్వాత గంటా చేరికపై మరింత ప్రచారం పెరిగిపోతోంది. అధికారికంగా ఈ చేరికలపై ఎవరు మాట్లాడటంలేదు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

First Published:  27 Nov 2022 10:02 AM IST
Next Story