Telugu Global
Andhra Pradesh

కేసు కొట్టేయండి.. అరెస్ట్‌ను అడ్డుకోండి

ఫేక్ వీడియోను ఐ-టీడీపీ ద్వారా సోషల్ మీడియాలో ప్రచారం చేసి తన పరువుకు నష్టం కలిగించారని, మానసిక వేధనకు గురి చేశారని ఇందులో చింతకాయల విజయ్ ప్రమేయం కూడా ఉందని గోరంట్ల మాధవ్ ఇది వరకు సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు కొట్టేయండి.. అరెస్ట్‌ను అడ్డుకోండి
X

ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఫిర్యాదుతో తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ టీడీపీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడు విజయ్ హైకోర్టును ఆశ్రయించారు. తనను సీఐడీ అరెస్ట్ చేయకుండా తక్షణం ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఫేక్ వీడియోను ఐ-టీడీపీ ద్వారా సోషల్ మీడియాలో ప్రచారం చేసి తన పరువుకు నష్టం కలిగించారని, మానసిక వేధనకు గురి చేశారని ఇందులో చింతకాయల విజయ్ ప్రమేయం కూడా ఉందని గోరంట్ల మాధవ్ ఇది వరకు సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు అయింది.

విజయ్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ వాట్సాప్ గ్రూప్‌ ఎవరు క్రియేట్ చేసినా గ్రూపులో సభ్యులుగా ఉన్న వారిలో ఎవరైనా పోస్టులు పెట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. గోరంట్ల మాధవ్ వీడియోను చింతకాయల విజయ్ పోస్టు చేయలేదని.. బ్రిటన్ నెంబర్‌తో ఐ-టీడీపీ గ్రూపులో అప్‌లోడ్ చేశారని కాబట్టి విజయ్‌కు ఇందులో ప్రమేయం లేదని వాదించారు.

బ్రిటన్ నెంబర్ నుంచి వీడియోను అప్‌లోడ్‌ చేసిన వ్యక్తినే సీఐడీ విచారించాల్సి ఉంటుందన్నారు. సదరు గ్రూపులో విజయ్ సభ్యుడు కూడా కాదని కోర్టుకు వివరించారు. విజయ్‌ కోసం సీఐడీ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని.. కాబట్టి అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇందుకు స్పందించిన సీఐడీ తరపు న్యాయవాది.. వివరాలు తెలుసుకునేందుకు తమకు సమయం కావాలని కోరారు. దాంతో విచారణ వాయిదా పడింది.

First Published:  14 Sept 2022 9:55 AM IST
Next Story