వాచ్ కూడా లేదనే బాబూ.. గంటకి రూ.కోటి తీసుకునే లాయర్ ఎలా వచ్చాడు?
పవన్ కల్యాణ్ అయితే తన పార్టీ నేతనే అరెస్ట్ చేసినట్టుగా ఓవర్ యాక్షన్ చేశాడని అనిల్‌కుమార్ విమర్శించారు. చంద్రబాబు సుపుత్రుడు సైలెంట్‌గా ఉంటే.. పవన్ మాత్రం నానా హంగామా చేశాడని చెప్పారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున వాదించేందుకు ఢిల్లీ నుంచి దేశంలోనే టాప్ లాయర్లలో ఒకరైన సిద్ధార్థ్ లూథ్రా వచ్చారు. ఆయన తన ఫీజును భారీగా తీసుకుంటారనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే దీనిపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తనకు వాచ్ కూడా లేదని చెప్పే చంద్రబాబు తరఫున వాదించేందుకు గంటకు కోటి రూపాయలు ఫీజు తీసుకునే లాయర్ ఎలా వచ్చాడంటూ ప్రశ్నించారు. నెల్లూరులో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తీరుపైనా ఆయన ధ్వజమెత్తారు. తన మరిదిని కాపాడుకునేందుకు పురందేశ్వరి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. పక్కా సాక్ష్యాలు ఉన్నా కూడా అక్రమ కేసు అని ఎలా చెబుతారని పురందేశ్వరిని ప్రశ్నించారు. బంధు ప్రీతి పక్కన పెట్టి ఆమె మాట్లాడాలని ఆయన చెప్పారు.
ఇక పవన్ కల్యాణ్ అయితే తన పార్టీ నేతనే అరెస్ట్ చేసినట్టుగా ఓవర్ యాక్షన్ చేశాడని అనిల్‌కుమార్ విమర్శించారు. చంద్రబాబు సుపుత్రుడు సైలెంట్‌గా ఉంటే.. పవన్ మాత్రం నానా హంగామా చేశాడని చెప్పారు. చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు అరెస్టుతో టీడీపీ కూసాలు కదులుతున్నాయని అనిల్ ఈ సందర్భంగా చెప్పారు. చంద్రబాబును అరెస్టు చేసే విషయంలో సీఎం జగన్ నిజాయతీగా వ్యవహరించారని తెలిపారు. ఎవరు తప్పు చేసినా వదలం అనే మెసేజ్ ప్రజలకు పంపారని వివరించారు. బాబు మరో 6 జన్మలు ఎత్తినా సీఎం అయ్యే అవకాశం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు అరెస్టుతో టీడీపీ మూతపడటం ఖాయమని అనిల్ చెప్పారు.