Telugu Global
Andhra Pradesh

వీరప్పన్‌ కూడా తాను దొంగను కాదనే చెప్పాడు.. - లోకేశ్‌కు పేర్ని నాని కౌంటర్‌

25 రోజుల నుంచి ఢిల్లీలో ఎందుకు తిరుగుతున్నావు.. ఎవరి కాళ్లు, చేతులు పట్టుకోవడానికి ఢిల్లీ వెళ్లావు.. అంటూ లోకేశ్‌ని పేర్ని నాని నిలదీశారు.

వీరప్పన్‌ కూడా తాను దొంగను కాదనే చెప్పాడు.. - లోకేశ్‌కు పేర్ని నాని కౌంటర్‌
X

ఈ భారతదేశంలోనే అత్యంత నీతివంతుడు, నిఖార్సయిన నారా చంద్రబాబును రాజకీయ కక్షతో వ్యవస్థలను మేనేజ్‌ చేసి సీఎం జగన్‌ జైల్లో పెట్టించారంటూ నారా లోకేశ్, ఆయన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి కలిసి ఫ్యామిలీ సెంటిమెంట్‌ పండించాలని చూశారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వీరప్పన్‌ పోలీసులకు దొరికిపోయినప్పుడు కూడా తాను దొంగను కాదనే చెప్పాడని, అడవికి న్యాయం చేస్తున్నానని చెప్పాడని ఆయన వివరించారు. 40 ఏళ్లలో చంద్రబాబు ఇప్పుడే దొరికాడని, అంత నిజాయతీపరులైతే మీ ఆస్తులపై కోర్టు పర్యవేక్షణలో విచారణకు సిద్ధమా అని సవాల్‌ చేశారు.

25 రోజుల నుంచి ఢిల్లీలో ఎందుకు తిరుగుతున్నావు.. ఎవరి కాళ్లు, చేతులు పట్టుకోవడానికి ఢిల్లీ వెళ్లావు.. అంటూ లోకేశ్‌ని పేర్ని నాని నిలదీశారు. చంద్రబాబు ఫ్యామిలీ అంతా కలిసి సెంటిమెంట్‌ ప్లే చేసేందుకు ప్రయత్నించారని విమర్శించారు. చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత లోకేశ్‌ ఎక్కడున్నాడని పేర్ని నాని ప్రశ్నించారు. లాయర్లంతా బెజవాడ రోడ్లపై తిరుగుతుంటే లోకేశ్‌ ఎక్కడున్నాడని నిలదీశారు. ఎవరిని మేనేజ్‌ చేద్దామని ఢిల్లీ వెళ్లారని ప్రశ్నించారు. మేనేజ్‌ చేయడం మీకు బాగా తెలిసిన విద్య అంటూ మండిపడ్డారు.

బీజేపీ కంటే.. బాబే ముఖ్యమంటూ..

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బీజేపీ కంటే చంద్రబాబే తనకు ముఖ్యమని తేల్చి చెప్పారని పేర్ని నాని గుర్తుచేశారు. కృష్ణా జిల్లాలో పవన్‌ 5 రోజుల పాటు ఆటవిడుపు యాత్ర చేశారని ఆయన విమర్శించారు. పవన్‌ మాటలు జనసేన పార్టీ కార్యకర్తలకు కూడా నచ్చడం లేదని తెలిపారు. జగన్‌కు దమ్ముంది కాబట్టే ఏ పార్టీతో పొత్తు లేకుండా పోటీచేస్తానని చెప్పారని వివరించారు. సీఎం జగన్‌పై అవాకులు చవాకులు మాట్లాడితే సహించేది లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్‌ ఏపీకి పట్టిన మహమ్మారి అని పేర్ని నాని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన ఒక్క పథకం చెప్పు. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు కొల్లేరుకు ఏం చేశారు.. అంటూ నిలదీశారు.

First Published:  7 Oct 2023 8:24 AM IST
Next Story