Telugu Global
Andhra Pradesh

వైసీపీ వైపే అడుగులు.. హింట్ ఇచ్చేసిన పోతిన

జనసేన నాయకులు పక్క పార్టీ జెండాలు మోస్తూ కిరాయి వ్యక్తులుగా మారిపోయారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు పోతిన. తనకు జెండాలు మోయడం ఇష్టం లేదన్నారు.

వైసీపీ వైపే అడుగులు.. హింట్ ఇచ్చేసిన పోతిన
X

జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేష్‌.. వైసీపీలో చేరుతారని తెలుస్తోంది. ఈ మేరకు ఆయన హింట్ ఇచ్చారు. ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ.. సింహంలా సింగిల్‌గా వచ్చే నాయకుడితోనే తన పయనమన్నారు పోతిన. 10 మంది కలిసి ఒకరి మీద దాడి చేయడం సరికాదన్నారు. నాయకత్వం అంటే భవిష్యత్‌పై నమ్మకం కలిగించాలన్నారు. మాట ఇస్తే ఆ మాట మీద నిలబడే నాయకత్వం ఉండాలన్నారు. అలా మాట ఇస్తే నిలబడే నాయకత్వం ఎవరిదో ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసన్నారు పోతిన. కార్యకర్తలు, తన అభిమానులు అటువైపే అడుగులు వేయాలని కోరుకుంటున్నారని చెప్పారు.


జనసేన నాయకులు పక్క పార్టీ జెండాలు మోస్తూ కిరాయి వ్యక్తులుగా మారిపోయారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు పోతిన. తనకు జెండాలు మోయడం ఇష్టం లేదన్నారు. జనసేనలో తనను రాజకీయంగా, వ్యక్తిగతంగా చంపేశారన్నారు పోతిన. జనసేనకు రాజీనామాతో తనకు పునర్జన్మ మొదలైందన్నారు. నమ్మకం ఇచ్చే నాయకుడితోనే ఇకపై తన పయనం ఉంటుందన్నారు.

కులాల మధ్య గొడవ పెట్టాలనుకునేది పవన్‌కల్యాణేనన్నారు పోతిన. పవన్‌కల్యాణ్‌ను కాపులే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. జనసేన కేవలం గోదావరి జిల్లాలకు మాత్రమే పరిమితమైందన్నారు పోతిన. వైసీపీకి తాను అమ్ముడుపోయానన్న జనసేన నాయకుల విమర్శలను తీవ్రంగా ఖండించారు. తనపై విమర్శలు చేస్తున్న నాయకుల పరిస్థితి ఏంటో తనకు తెలుసన్నారు. రంగాను హత్య చేసిన వారితో ఫొటోలు దిగుతున్న వారికి తనను ప్రశ్నించే అర్హత లేదంటూ మండిపడ్డారు.

First Published:  9 April 2024 12:33 PM GMT
Next Story