Telugu Global
Andhra Pradesh

ఏపీ మరో మూడు ముక్కలకు సిద్ధం.. రెండు దేశాల మాట రాకుండా ఉంటుందా?

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ కూడా ఇంకో మూడు ముక్కలు అవడానికి సిద్ధంగా ఉందని.. అందుకు కూడా ఇదే సోకాల్డ్ జాతీయవాదులు వెనుక నుంచి రకరకాలుగా మద్దతు ఇస్తున్నారన్నారు.

ఏపీ మరో మూడు ముక్కలకు సిద్ధం.. రెండు దేశాల మాట రాకుండా ఉంటుందా?
X

మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీ మూడు ముక్కలు అయ్యేందుకు సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ రచించిన ''రాజ్యం.. మతం.. కోర్టులు.. హక్కులు'' పుస్తకావిష్కరణ సభలో ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలో, రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై మాట్లాడారు.

మతం అనేది చాలా కాలంగా మనిషి జీవితంతో పెనవేసుకుపోయిందన్నారు. ప్రకృతి శక్తులను ఎదురించే శక్తిగానీ, అర్థం చేసుకుని మానసిక స్థితి గానీ లేని కాలం నుంచి దేవుడిపై నమ్మకం, కొన్ని మూఢ నమ్మకాలు బయలుదేరాయన్నారు. ఇప్పటికీ ఆ పరిస్థితి కొనసాగుతోందన్నారు. దురాశ కూడా దేవుడిపై మనిషి ఆధారపడటానికి మరో కారణమన్నారు. పరిష్కరించలేని సమస్య ఎదురైనప్పుడు దాని బాధ్యతను మరొకరికి అప్పగించే ప్రయత్నంలోనూ దేవుడి మీద ఆధారపడుతుంటామన్నారు.

అదృష్టం, దురదృష్టం అన్నది మనుషులకు యాదృశ్చికంగానే ఎదురుతాయన్నారు. ఈ అదృష్టం కోసం కూడా దేవుడిని మొక్కుతుంటామని ఏబీ అభిప్రాయపడ్డారు. ఇలా మనిషి అశక్తత, దురాశ, భయం నుంచి దైవభక్తి, మతం వంటివి పుట్టాయన్నారు. పురాతన కాలంలో చూస్తే మతం అనేది ఎవరికి వారికి సంబంధించిన ముఖ్యమైన అంశమే కానీ.. సామాజికవర్గంగా పెద్దగా ఎవరికీ ఇబ్బంది తేలేదన్నారు. ఆ తర్వాత వివిధ మతాలు ప్రవేశించడం, మత మార్పిడిలు, దండయాత్రలు వంటి వాటి కారణంగా రకరకాల మతాలు కలిసి బతకాల్సిన పరిస్థితి రావడం మొదలైందన్నారు. పలు మతాల వారు కలిసి బతకాల్సిన పరిస్థితి కారణంగా ఘర్షణలు ఎక్కడా లేవన్నారు. మన దేశంలో భిన్న మతాలకు చెందిన రాజుల మధ్య జరిగిన యుద్ధాలను కేవలం రాజ్యం కోసం జరిగినవే గానీ.. అవి మతం కోసం జరిగినవి కావన్నారు.

లౌకికవాదం అన్నది మనిషి ఆలోచన స్థాయి ఎదుగుతోందనడానికి నిదర్శనమన్నారు. ఈ దేశంలో మతాల మధ్య వస్తున్న తేడాలను సమర్ధవంతంగా పరిష్కరించడంలో స్వాతంత్ర కాలం నాటి నాయకత్వం సమర్ధవంతంగా పనిచేయలేకపోయిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బహుశా స్వాతంత్ర ఉద్యమంలో తీరిక లేకుండా ఉండటం కూడా కారణం కావొచ్చన్నారు. ఈ దేశంలో లౌకిక వాదం ఎందుకు అవసరం అన్న దాన్ని ప్రజలకు పూర్తిగా వివరించడంలో వైఫల్యం ఉందన్నారు. దీనికి తోడు ఓటు బ్యాంకు రాజకీయాలు మొదలై.. కొందరిని సంతృప్తిపరిచే రాజకీయాల కారణంగా.. లౌకిక భావం అన్న దానిపై అవిశ్వాసం, లేనిపోని అనుమానాలు కలిగాయన్నది కూడా వాస్తవమన్నారు. దాన్ని అనువుగా తీసుకుని కొందరు లౌకిక వాదమే వృథా అన్న వాతావరణాన్ని సమాజంలో సృష్టిస్తున్నారన్నారు. లౌకిక వాదం అన్నది ఆధునిక మనిషి ఆలోచన అన్నారు.

హిందూమతం ఒక జీవిన విధానమని మొన్నటి వరకు మాట్లాడిన వారు ఇప్పుడు ఆ విషయం మాట్లాడడం లేదన్నారు. లౌకిక వాదం అన్నది భారతదేశ మనుగడకు అత్యంత ముఖ్యమన్నారు. సోకాల్డ్ జాతీయ వాదులు కూడా తెలుగు వాళ్లు రెండు రాష్ట్రాలుగా ఉంటే ఏంటి? మూడు రాష్ట్రాలుగా ఉంటే ఏంటి అని మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ కూడా ఇంకో మూడు ముక్కలు అవడానికి సిద్ధంగా ఉందని.. అందుకు కూడా ఇదే సోకాల్డ్ జాతీయవాదులు వెనుక నుంచి రకరకాలుగా మద్దతు ఇస్తున్నారన్నారు. ఇదే తీరు కొనసాగితే భారతీయులు రెండు దేశాలుగా ఉంటే తప్పేంటి అన్న ప్రశ్న రావడానికి ఎంత సమయం పడుతుందని ప్రశ్నించారు.

ఈ దేశంలో నిరక్షరాస్యత తగ్గింది కానీ.. మూఢ‌త్వం, అంధత్వం పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితులు మారాలంటే ముందు ప్రజల్లో ఆలోచనలు వికసించాలన్నారు.

First Published:  6 Jan 2023 9:53 AM IST
Next Story