మేం ఎంతగా చెప్పినా చంద్రబాబు వినలేదు- మాజీ డీజీపీ
అమరావతి ప్రాంతం రాజధానిగా ఏమాత్రం అనుకూలమైనది కాదన్నారు. నిత్యం పంటలతో కళకళలాడే కృష్ణా డెల్టా ప్రాంతాన్ని చంద్రబాబు రాజధాని పేరుతో నాశనం చేశారని విమర్శించారు.
రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ప్రకటించి చంద్రబాబు పెద్ద తప్పు చేశారని వ్యాఖ్యానించారు మాజీ డీజీపీ ఆంజనేయరెడ్డి. రాజధాని ప్రకటన సమయంలో ఇది వరకు ఉన్నత పదవుల్లో పనిచేసిన వారంతా సిటిజన్స్ ఫోరంగా ఏర్పడి చంద్రబాబును కలిసి దొనకొండ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించాలని సూచించామన్నారు.
దొనకొండ వద్ద లక్ష ఎకరాల ప్రభుత్వ భూమి ఉండటం, సముద్రమట్టానికి ఎగువన ఉండటంతో డ్రైనేజ్ సమస్య ఉండకపోవడం, నిర్మాణ వ్యయం తక్కువగా ఉండటం లాంటి పది సానుకూల అంశాలను చంద్రబాబుకు వివరించామన్నారు. అయినప్పటికీ చంద్రబాబు అవేవీ పట్టించుకోకుండా ఏకపక్షంగా 29 గ్రామాలను అమరావతి పేరుతో రాజధానిగా ప్రకటించారని విమర్శించారు.
అమరావతి ప్రాంతం రాజధానిగా ఏమాత్రం అనుకూలమైనది కాదన్నారు. నిత్యం పంటలతో కళకళలాడే కృష్ణా డెల్టా ప్రాంతాన్ని చంద్రబాబు రాజధాని పేరుతో నాశనం చేశారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర పరిధిలోకి తీసుకోవడం చంద్రబాబు చేసిన మరో పెద్ద పొరపాటు అని ఆంజనేయరెడ్డి విమర్శించారు. అలా చేసి ఉండకపోతే కేంద్రమే పోలవరం ప్రాజెక్టును నిర్మించి ఉండేదన్నారు.