Telugu Global
Andhra Pradesh

దాడులపై చంద్రబాబు, పవన్‌ స్పందించాలి.. - మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ డిమాండ్‌

తాము రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం అనుకున్నాం తప్ప ఎలాంటి దుశ్చర్యలకూ ఏనాడూ పాల్పడలేదని తెలిపారు. రాజకీయాలలో ఎవరూ శాశ్వతం కాదని, అధికారం ఎల్లకాలం ఉండదని తెలుసుకోవాలని చెప్పారు.

దాడులపై చంద్రబాబు, పవన్‌ స్పందించాలి.. - మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ డిమాండ్‌
X

ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్‌గా చేసుకొని టీడీపీ, జనసేన పార్టీల నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని, ప్రభుత్వ ఆస్తులను సైతం ధ్వంసం చేస్తున్నారని దీనిపై చంద్రబాబు, పవన్‌ స్పందించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. వారు స్పందించకుంటే ఈ దాడులు వారి ప్రోత్సాహంతోనే జరుగుతున్నట్టు భావించాల్సి ఉంటుందని చెప్పారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలో దాడులకు పాల్పడిన పలు గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. టీడీపీ, జనసేన పార్టీలకు చెందినవారు మాధవరం, జగన్నాధపురం తదితర గ్రామాల్లో ధ్వంసం చేసిన శిలాఫలకాలు, తగలబెట్టిన గడ్డివాములను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, దాడుల సంస్కృతి మంచిది కాదని హితవు పలికారు. 2019లో వైసీపీ గెలిచినప్పుడు ఇదే రీతిన దాడులు చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. చివరకు మూగజీవాలకు ఆహారమైన గడ్డిని కూడా తగలబెట్టడం వారి పైశాచిక ఆనందానికి, రాక్షస స్వభావానికి నిదర్శనమని కొట్టు మండిపడ్డారు. సీసీ కెమెరాలను ఆపేసి మరీ దాడులకు పాల్పడ్డారని, వారు గుర్తించని మరో సీసీ కెమెరాలో దాడులు రికార్డయ్యాయని ఆయన చెప్పారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారించి నిందితులను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

ఈ ఎన్నికల్లో కూటమి.. ప్రజలను ప్రలోభాలకు గురి చేసి విజయం సాధించిందని ఆయన విమర్శించారు. ఏది ఏమైనా ప్రజలు తీర్పే అంతిమ తీర్పు కాబట్టి శిరసావహించాల్సిందేనని చెప్పారు. తాము రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం అనుకున్నాం తప్ప ఎలాంటి దుశ్చర్యలకూ ఏనాడూ పాల్పడలేదని తెలిపారు. రాజకీయాలలో ఎవరూ శాశ్వతం కాదని, అధికారం ఎల్లకాలం ఉండదని తెలుసుకోవాలని చెప్పారు. జగన్నాధపురంలో గ్రామ సచివాలయం శిలాఫలకాలను ధ్వంసం చేయడం ఆ గ్రామంలోని టీడీపీ, జనసేన నాయకుల కండకావరానికి నిదర్శనమని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అలాంటివారికి ఏదో ఒకరోజు తగిన శాస్తి జరగక తప్పదని హెచ్చరించారు. దాడులపై వైసీపీ తరపున రాష్ట్రపతికి, గవర్నర్‌కు, జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

First Published:  12 Jun 2024 8:53 PM IST
Next Story