Telugu Global
Andhra Pradesh

ఆ జీవో స‌రైన‌దే.. - సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌

ఇటీవ‌ల జ‌రిగిన ఘ‌ట‌న‌ల దృష్ట్యా జీవో నంబ‌ర్ - 1ను అమ‌లు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న చెప్పారు. అధికార పార్టీకి ఒక విధంగా, ప్ర‌తిప‌క్ష, విప‌క్ష‌ పార్టీల‌కు మ‌రో విధంగా అమ‌లు చేయ‌రాద‌ని చెప్పారు.

ఆ జీవో స‌రైన‌దే..  - సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌
X

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన జీవో నంబ‌ర్ 1 స‌రైన‌దేన‌ని సీబీఐ మాజీ జేడీ వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ తెలిపారు. శ్రీ‌కాకుళం జిల్లా కంచిలిలో శుక్ర‌వారం ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడారు. ఇటీవ‌ల జ‌రిగిన ఘ‌ట‌న‌ల దృష్ట్యా ఈ జీవోను అమ‌లు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న చెప్పారు. దీనిని నిష్ప‌క్ష‌పాతంగా అమ‌లు చేయాలని ఈ సంద‌ర్భంగా ఆయ‌న తెలిపారు. అధికార పార్టీకి ఒక విధంగా, ప్ర‌తిప‌క్ష, విప‌క్ష‌ పార్టీల‌కు మ‌రో విధంగా అమ‌లు చేయ‌రాద‌ని చెప్పారు. మొత్తంగా రోడ్ల‌పై స‌భ‌లు, రోడ్‌షోలు నిర్వ‌హించే సంద‌ర్భాల్లో అనువైన స్థ‌లాల‌ను అంచ‌నా వేసేందుకు పోలీసుల అనుమ‌తిని త‌ప్ప‌నిస‌రి చేస్తూ అమ‌లు చేస్తున్న ఈ జీవో మంచిదేన‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

చిన్న రాష్ట్రాల డిమాండ్ స‌రికాదు..

ఉత్త‌రాంధ్ర ప్ర‌త్యేక రాష్ట్రం వంటి చిన్న‌ రాష్ట్రాల డిమాండ్ స‌రికాద‌ని ల‌క్ష్మీనారాయ‌ణ తెలిపారు. అన్ని ప్రాంతాల‌నూ అభివృద్ధి చేయ‌డం ముఖ్య‌మ‌ని ఆయ‌న చెప్పారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని, అయితే ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని తాను భావించడం లేద‌ని ల‌క్ష్మీనారాయ‌ణ తెలిపారు. ఎన్నిక‌ల నియ‌మావ‌ళిలో సంస్క‌ర‌ణ‌లు తేవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న చెప్పారు.

ప్ర‌భుత్వ ప‌నితీరు భేష్..

శ్రీ‌కాకుళం జిల్లా ప‌లాస‌లో ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న కిడ్నీ రీసెర్చ్ సెంట‌ర్ చూస్తుంటే ఆనందంగా ఉంద‌ని ల‌క్ష్మీనారాయ‌ణ తెలిపారు. ఉద్దానం కిడ్నీ రోగుల కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం శాశ్వ‌త ప‌రిష్కారం చేప‌డుతున్నందుకు ప్ర‌భుత్వ ప‌నితీరును మెచ్చుకుంటున్న‌ట్టు సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ చెప్పారు. ప‌లాస కాశీబుగ్గ మున్సిపాలిటీ ప‌రిధిలో ప‌ద్మ‌నాభ‌పురం వ‌ద్ద నిర్మిస్తున్న 200 ప‌డ‌క‌ల కిడ్నీ ఆస్ప‌త్రిని ఆయ‌న సంద‌ర్శించారు. ఇక్క‌డ కిడ్నీ వ్యాధి శాశ్వ‌త ప‌రిష్కారానికి గ‌త ప్ర‌భుత్వాలు ఆలోచ‌న చేయ‌లేద‌ని, రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రి నిర్మించ‌డం గొప్ప విష‌య‌మ‌ని ఆయ‌న అభినందించారు. ఉద్దానంలో ఇంటింటికీ శుద్ధ జ‌లం అందించేందుకు రూ.700 కోట్ల‌తో ప్రాజెక్టు నిర్మించ‌డం గొప్ప కార్య‌క్ర‌మ‌మ‌ని చెప్పారు. మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజుతో ఫోనులో మాట్లాడి ప్ర‌భుత్వ ప‌నితీరును ల‌క్ష్మీనారాయ‌ణ మెచ్చుకున్నారు.

First Published:  14 Jan 2023 9:37 AM IST
Next Story