Telugu Global
Andhra Pradesh

వైసీపీలోకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. క్లారిటీ ఇదే

'నేను వైద్య శిబిరాలు, నాడు - నేడు కార్యక్రమాలను అభినందించాను. అంతమాత్రాన నేను అధికార పార్టీలో చేరతానని, వారి టికెట్‌పై పోటీ చేస్తానంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేయడం సరికాదు' అని ట్వీట్ చేశారు.

వైసీపీలోకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. క్లారిటీ ఇదే
X

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ త్వరలో అధికార వైసీపీలో చేరనున్నట్టు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రచారంపై తాజాగా లక్ష్మీనారాయణ స్పందించారు. తాను అధికార పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు.

సీబీఐ జేడీగా లక్ష్మీనారాయణ ఉన్న సమయంలోనే ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత అయిన జగన్ అవినీతికి పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో జగన్ జైలుకు వెళ్లడంతో లక్ష్మీనారాయణ పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఏపీలో ఆయన పేరు మార్మోగింది.

ఏపీలో తనకు వచ్చిన గుర్తింపును దృష్టిలో పెట్టుకొని లక్ష్మీనారాయణ తన ఉద్యోగానికి రాజీనామా చేసి గత ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి వచ్చారు. ముందుగా సొంత పార్టీ పెట్టాలని భావించి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ జనసేన పార్టీలో చేరారు. విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన జనసేనకు కూడా రాజీనామా చేశారు.

అయితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసేందుకు లక్ష్మీనారాయణ సిద్ధమవుతున్నారు. దీనిపై ఆయన ప్రకటన కూడా చేశారు. ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే విషయం గురించి తెలపలేదు. అయితే ఈసారి ఆయన అధికార పార్టీ వైసీపీలో చేరి ఎన్నికల్లో పోటీ చేస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.

జగన్ జైలుకు వెళ్లడానికి కారణమైన వ్యక్తుల్లో ఒకరైన లక్ష్మీనారాయణ జగన్ ఆధ్వర్యంలోని పార్టీలో చేరేందుకు అవకాశం లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే వైసీపీలో చేరనున్నట్టు జరుగుతున్న ప్రచారంపై తాజాగా లక్ష్మీనారాయణ స్పందించారు. ట్విట్టర్ వేదికగా దీనిపై క్లారిటీ ఇచ్చారు.

'శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి నన్ను ప్రభుత్వ కార్యక్రమానికి ఆహ్వానించారు. నేను వైద్య శిబిరాలు, నాడు - నేడు కార్యక్రమాలను అభినందించాను. అంతమాత్రాన నేను అధికార పార్టీలో చేరతానని, వారి టికెట్‌పై పోటీ చేస్తానంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేయడం సరికాదు' అని ట్వీట్ చేశారు. లక్ష్మీనారాయణ చేసిన ట్వీట్‌ను బట్టి ఆయన అధికార పార్టీలో చేరనున్నట్లు వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని తేలింది.


First Published:  30 Oct 2023 11:55 AM IST
Next Story