Telugu Global
Andhra Pradesh

అందుకే కాంగ్రెస్ ను వీడా.. కాషాయ కండువాలో మాజీ సీఎం కిరణ్

గతంలో మోదీ, తాను ఒకేసారి ముఖ్యమంత్రులుగా ఉన్నామని, అప్పట్లో ఆయనతో కొన్ని సందర్భాల్లో కలిశానని, ఆయన నాయకత్వంలో పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు మాజీ సీఎం కిరణ్.

అందుకే కాంగ్రెస్ ను వీడా.. కాషాయ కండువాలో మాజీ సీఎం కిరణ్
X

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి, ఆ పార్టీ నేతలు అరుణ్‌ సింగ్‌, లక్ష్మణ్‌ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. పార్టీ తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా పనిచేస్తానన్నారు. గతంలో మోదీ, తాను ఒకేసారి ముఖ్యమంత్రులుగా ఉన్నామని, అప్పట్లో ఆయ‌న్ను కొన్ని సందర్భాల్లో కలిశానని, ఆయన నాయకత్వంలో పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు.

కాంగ్రెస్ ని ఎందుకు వీడానంటే..?

రాష్ట్ర విభజన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి జై సమైక్యాంధ్ర అంటూ సొంత పార్టీ పెట్టుకున్నారు. 2014 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఆయన దుకాణం మూసేశారు. ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్ లో చేరారు, ఇప్పుడు మళ్లీ ఆ పార్టీకి దూరమై బీజేపీ గూటికి వచ్చారు. 60 ఏళ్లుగా తమ కుటుంబం రాజకీయాల్లో ఉందని, తానెప్పుడూ కాంగ్రెస్ ని వీడిపోవాలని అనుకోలేదని చెప్పారు కిరణ్ కుమార్ రెడ్డి. ఆ పార్టీ సరైన దారిలో వెళ్లడం లేదన్నారు. ప్రజా తీర్పుని కూడా వారు గౌరవించడం లేదని, తప్పులు తెలుసుకోలేదని, వాటిని సరిదిద్దుకునే ఆలోచన కూడా ఆ పార్టీ పెద్దలకు లేదని ఆరోపించారు.


తప్పుడు నిర్ణయాలతో కాంగ్రెస్ ప్రభ తగ్గిపోయిందని, అదే సమయంలో బీజేపీ రోజు రోజుకీ బలపడుతోందని చెప్పారు కిరణ్. కాంగ్రెస్ రాజ్యంలో రాజు సొంతగా నిర్ణయాలు తీసుకోలేరని, ఎవరి సలహాలనూ వినే స్థితిలో కూడా ఉండరంటూ ఎద్దేవా చేశారు. వారు బాధ్యతలు తీసుకోరని, కేవలం పెత్తనం చెలాయించాలనుకుంటారని అన్నారు. ఎవరికి ఏ పని అప్పజెప్పాలనే విషయం కాంగ్రెస్ లో ఎవరికీ తెలియదన్నారు.

రెండు ఎంపీ స్థానాలతో తన ప్రస్థానం ప్రారంభించిన బీజేపీ ఇప్పుడు 300 పైచిలుకు ఎంపీ స్థానాలు గెలుచుకోవడం వెనక ఎంతో కృషి ఉందన్నారు. మోదీ, అమిత్ షా నాయకత్వంలో పనిచేసేందుకు తాను సిద్ధం అని చెప్పారు కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన వెంట ఏపీ బీజేపీ నేతలు కూడా ఉన్నారు. ఈ మాజీ సీఎం చేరికతో బీజేపీ ఏమాత్రం బలపడుతుందో చూడాలి.

First Published:  7 April 2023 7:55 AM GMT
Next Story