’మార్గదర్శి’ మోసాలపై పోరుకు బాధితుల సంఘం ఏర్పాటు
మార్గదర్శి చిట్ ఫండ్స్ బాధితులకు న్యాయ సహాయం, ఇతర సహకారం అందించేందుకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. బాధితుల సమస్యలను ప్రభుత్వదృష్టికి తీసుకువెళతామన్నారు.

మార్గదర్శి చిట్‌ఫండ్స్ వల్ల వేధింపులకు గురైనవారు, వారి అక్రమాలు, మోసాలకు గురైనవారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. వీరంతా తమకు జరిగిన అన్యాయాన్ని ఎవరికి చెప్పుకోవాలో అర్థంగాక దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ క్రమంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ‘మార్గదర్శి’ అక్రమాలపై పోరాటం సాగిస్తుండటం, దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతుగా నిలవడం, మార్గదర్శి పరిస్థితి కూడా పూర్తిస్థాయిలో ఇరుక్కుపోయినట్టు అర్థమవుతుండటంతో ఇప్పుడు ఒక్కొక్కరు తమకు జరిగిన అన్యాయాన్ని, మోసాన్ని చెప్పేందుకు బయటపడుతున్నారు.
మరోపక్క తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మార్గదర్శిలో జరుగుతున్నది నిబంధనలకు విరుద్ధమేనని సుప్రీంకోర్టు ముందు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే మార్గదర్శి చిట్‌ఫండ్స్ మోసాలకు గురైనవారికి అండగా నిలిచేందుకు, మార్గదర్శి అక్రమాలపై పోరాడేందుకు తాజాగా ఒక సంఘం కూడా ఏర్పాటైంది.
మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘం.. ఇదే ఆ సంఘం పేరు. విజయవాడ కేంద్రంగా ఈ సంఘాన్ని రిజిస్టర్ చేయించారు. ఈ విషయాన్ని ఆ సంఘ అధ్యక్షుడు, న్యాయవాది ఎం.శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ బాధితులకు న్యాయ సహాయం, ఇతర సహకారం అందించేందుకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. బాధితుల సమస్యలను ప్రభుత్వదృష్టికి తీసుకువెళతామన్నారు.
రామోజీ రావు, మార్గదర్శి చిట్‌ఫండ్స్ మోసాలకు వ్యతిరేకంగా సంఘటితంగా పోరాడటం ద్వారా బాధితులకు న్యాయం చేయడమే తమ సంఘం ప్రధాన లక్ష్యమన్నారు. బాధితులు తమ సమస్యలను తెలిపేందుకు 98490 55267 నంబర్‌లో సంప్రదించాలని ఆయన సూచించారు. బాధితులకు అండగా ఉండేందుకు సంఘం కూడా ఏర్పాటు చేయడంతో ఇక బాధితులు ధైర్యంగా బయటికొచ్చి తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించేందుకు అవకాశముంది.