టీడీపీ జాబితాలో 23 కొత్త ముఖాలు.. వారసుల వాసనే ఎక్కువ
అయితే వీరిలో ఎక్కువ మంది గతంలో టీడీపీలో చక్రం తిప్పిన చంద్రబాబు భజన బృందంలోని నేతల వారసులే కావడం గమనార్హం.
జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా చంద్రబాబు కాసేపటి కిందట 94 మందితో తొలి జాబితా ప్రకటించారు. సీనియర్లు, కొత్తవారు అందరికీ చోటు ఇచ్చారు. తొలి జాబితాలో 23 మంది తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని చంద్రబాబు ప్రకటించారు. అయితే వీరిలో ఎక్కువ మంది గతంలో టీడీపీలో చక్రం తిప్పిన చంద్రబాబు భజన బృందంలోని నేతల వారసులే కావడం గమనార్హం.
వారసులే వారసులు..
విజయనగరంలో సీనియర్ నేత అశోక్ గజపతి రాజు కుమార్తె అదితికి టికెటిచ్చారు, రాజమండ్రి సిటీలో దివంగత ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవాని ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ స్థానాన్ని భవాని భర్త ఆదిరెడ్డి వాసుకు కేటాయించారు. చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఆయన కుటుంబానికి దగ్గరుండి అన్నీ సమకూర్చినందుకు వాసుకు టికెట్ దక్కింది. తునిలో యనమల రామకృష్ణుడి కుమార్తె దివ్యకు టికెట్ దక్కింది. టీడీపీ మౌత్‌పీస్ వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమార్ రాజాకు అవకాశం ఇచ్చారు. జాబితాలో ఇంకా చాలామంది వారసులున్నా వారు ఇప్పటికే పోటీ చేసినవారే. కేఈ శ్యాంబాబు, కాగిత కృష్ణప్రసాద్, జేసీ అస్మిత్‌రెడ్డి, తంగిరాల సౌమ్య, దామచర్ల జనార్దన్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.
ఇవి పూర్తిగా కొత్త ముఖాలే
కావలిలో డబ్బు సంచులతో దిగారని టీడీపీ నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న కావ్యకృష్ణారెడ్డికి సీటిచ్చారు. అమరావతి జేఏసీ పేరుతో జగన్‌పై అడ్డగోలుగా విరుచుకుపడే కొలికపూడి శ్రీనివాసరావుకు తిరువూరు(ఎస్సీ) నియోజకవర్గం అభ్యర్థిగా అవకాశం కల్పించారు. ఉదయగిరిలో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావును కాదని డబ్బులు ఖర్చుపెడతారన్న లెక్కతో ఎన్నారై కాకర్ల సురేష్‌కు టికెట్ ఇచ్చారు. చిత్తూరులో గురజాల జగన్‌మోహన్, గంగాధర నెల్లూరులో డాక్టర్ ఎంవీ థామస్, కళ్యాణదుర్గంలో అమిలినేని సురేంద్ర, మడకశిరలో ఎంఈ సునీల్ కుమార్ వీరంతా పూర్తిగా కొత్త ముఖాలు.