Telugu Global
Andhra Pradesh

స్వామిభక్తికి పరాకాష్ట.. గంగమ్మకు J 'GUN' తోరణం

ఇంగ్లిష్ లో జె అక్షరం, దాని పక్కన తుపాకి బొమ్మ.. చూసినవారెవరికైనా వెంటనే J 'GUN' అనే పేరే గుర్తొస్తుంది. తోరణం ఏర్పాటు చేసి, నిర్వాహకులు సీఎం జగన్ పై స్వామిభక్తి చూపించారని తెలిసిపోతుంది.

స్వామిభక్తికి పరాకాష్ట.. గంగమ్మకు J GUN తోరణం
X

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో వైభవంగా జాతర జరుగుతోంది. అధికార పార్టీ నాయకులు, మంత్రులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. అంతా బాగానే ఉంది కానీ.. అమ్మవారి ఆలయం ముందు ఏర్పాటు చేసిన తోరణం మాత్రం ఇప్పుడు సరికొత్త వివాదానికి కారణం అయింది. ఆలయం ముందు పూలతోరణం ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఆ తోరణం ఏర్పాటు చేయడంలో నిర్వాహకుల ఉద్దేశం ఏంటో కానీ, దాన్ని చూసిన వారు మాత్రం షాకవుతున్నారు. దీనికి సంబంధించి తాజాగా చంద్రబాబు కూడా ట్వీట్ చేశారు. టీడీపీ అనుకూల మీడియాలో రచ్చ మొదలైంది.


ఇంగ్లిష్ లో జె అక్షరం, దాని పక్కన తుపాకి బొమ్మ.. చూసినవారెవరికైనా వెంటనే J 'GUN' అనే పేరే గుర్తొస్తుంది. తోరణం ఏర్పాటు చేసి, నిర్వాహకులు సీఎం జగన్ పై స్వామిభక్తి చూపించారని తెలిసిపోతుంది. దీంతో ప్రతిపక్షాలు విమర్శల దాడి మొదలు పెట్టాయి. చివరికి అమ్మవారి ఆలయం ముందు కూడా జగన్ భజన ఏంటని మండిపడుతున్నారు నాయకులు.

నేరుగా జగన్ తన పేరు పెట్టాలని, వైసీపీ జెండా రంగులు వేయాలని ఎక్కడా చెప్పరు. కానీ కొందరి అత్యుత్సాహమే కొంప ముంచుతుంది. ఆమధ్య టిడ్కో ఇళ్లకు వైసీపీ రంగులు, సచివాలయాలకు పార్టీ రంగులు వేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఆ తర్వాత వాటిని కవర్ చేసుకోడానికి నానా తంటాలు పడ్డారు అధికారులు. గన్ కంటే ముందు జగన్ వస్తారు, మహిళలను కాపడతారు అంటూ వైసీపీ నాయకులు చేసే హడావిడి కూడా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు గంగమ్మ ఆలయం ముందే J 'GUN' దర్శనమివ్వడంతో అందరూ షాకయ్యారు.


జగన్ గ్యాంగ్ లు బరితెగించాయని ట్విట్టర్లో మండిపడ్డారు నారా లోకేష్. దైవ సన్నిధిలో ఈ సంస్కృతి ఏంటని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌ రెడ్డి కూడా ఈ విషయంపై విమర్శలు ఎక్కుపెట్టారు.

First Published:  17 May 2023 8:03 AM IST
Next Story