తాడేపల్లిగూడెంలో ఫ్లెక్సీల వార్.. - బాబు పర్యటన నేపథ్యంలో రాత్రికి రాత్రే వెలసిన వ్యతిరేక ఫ్లెక్సీలు
ఇప్పుడు ఈ వ్యవహారం నేపథ్యంలో తాడేపల్లిగూడెంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సాయంత్రం చంద్రబాబు కార్యక్రమం నేపథ్యంలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఉత్కంఠ నెలకొంది.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఫ్లెక్సీల వార్ చర్చనీయాంశంగా మారింది. `ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి` అనే కార్యక్రమంతో ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లా నుంచి ప్రారంభించిన కార్యక్రమం శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరగనున్న నేపథ్యంలో ఈ వ్యవహారం చోటుచేసుకుంది.
ఇప్పటికే దెందులూరు, చింతలపూడి, పోలవరం నియోజకవర్గాలతో పాటు కొవ్వూరు నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు.. తాడేపల్లిగూడెం శేష మహల్ సెంటర్‌లో శుక్రవారం సాయంత్రం ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాక సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలను తాడేపల్లిగూడెం పట్టణంలో ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ జెండాలతో పలు ప్రాంతాలను అలంకరించారు.
తెల్లారేసరికి షాక్..
చంద్రబాబు శుక్రవారం నాడే వస్తారని అన్ని ఏర్పాట్లూ చేసుకున్న టీడీపీ శ్రేణులకు పెద్ద షాకే తగిలింది. శుక్రవారం ఉదయం ఒక్కసారిగా చంద్రబాబుకు వ్యతిరేకంగా పట్టణమంతటా ఫ్లెక్సీలు వెలిశాయి. చంద్రబాబును ఉద్దేశించి.. ఆయన వైఫల్యాలను ప్రస్తావిస్తూ.. ఆయన హయాంలో చేపట్టిన కార్యక్రమాలపై విమర్శలు గుప్పిస్తూ.. ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం గమనార్హం. దీంతో ఈ వ్యవహారం టీడీపీ శ్రేణులకు మింగుడు పడటం లేదు.
ఊరూ.. పేరూ.. లేకుండా..
తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ఎవరి పేరూ వేయలేదు. అజ్ఞాత వ్యక్తులు ఎవరో వీటిని రాత్రికి రాత్రి పట్టణం అంతటా అంటించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ నియోజకవర్గం కావడంతో ఆయన ఆదేశాలతో ఆయన మనుషులే ఈ విధంగా ఫ్లెక్సీలు వేసి ఉంటారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది వైఎస్సార్‌సీపీ కుట్రేనని మండిపడుతున్నారు.
ఇంతకీ ఆ ఫ్లెక్సీల్లో ఏమేమున్నాయంటే..
తాడేపల్లిగూడెంలో రాత్రికి రాత్రి వెలసిన ఫ్లెక్సీల్లో ఏర్పాటు చేసిన అంశాలు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. ఇంతకీ వాటిలో ఏమున్నాయంటే..
- `నువ్వొస్తే అరాచకం.. నువ్వొస్తే ప్రైవేటీకరణ.. నువ్వొస్తే కులతత్వం.. నువ్వొస్తే పోలవరం పడక.. నువ్వొస్తే పథకాలు రద్దు.. నువ్వొస్తే వెన్నుపోట్లు..
- 14 ఏళ్ల నీ దుర్మార్గ పాలనే.. ప్రజల ఖర్మ.. వద్దు `బాబో`య్.. వద్దు..
- నువ్వొస్తే.. గుడులు కూలుస్తావ్..
- నువ్వొస్తే.. కుట్రలు - కుతంత్రాలు
- నువ్వొస్తే.. వికేంద్రీకరణ తెరమరుగు..
- నువ్వొస్తే.. బడులు ప్రైవేటీకరణ చేస్తావు..
- నువ్వొస్తే.. వాడుకుంటావ్.. వదిలేస్తావ్..
ఇలాంటి వ్యాఖ్యలతో ఆయా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
ఇప్పుడు ఈ వ్యవహారం నేపథ్యంలో తాడేపల్లిగూడెంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సాయంత్రం చంద్రబాబు కార్యక్రమం నేపథ్యంలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ ఫ్లెక్సీలు తొలగిస్తారా లేదా.. ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది.