మహానాడు ముంగిట ముదిరిన ఫ్లెక్సీల వివాదం.. టీడీపీకి కొత్త తలనొప్పి
వాస్తవానికి ఎంపీ భరత్ పుట్టినరోజు వేడుకలు మే 12న ముగిశాయి. కానీ ఇప్పటికీ అలానే హోర్డింగ్స్, కటౌట్స్ నగరంలో ఉండటంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ ఈ ఏడాది మహానాడుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తోంది. రాజమహేంద్రవరం శివారులోని వేమగిరి ఈసారి మహానాడుకి ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ నెల 27న (శనివారం) కేవలం 15 వేల మంది ప్రతినిధులతో ప్రారంభకానున్న మహానాడు.. 28న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల వేడుకల్ని కూడా అక్కడే నిర్వహించబోతుండటంతో దాదాపు 15 లక్షల మంది రాబోతున్నారని టీడీపీ నేతలు చెప్తున్నారు. ఈ మేరకు వేమగిరిలో జాతీయ రహదారి పక్కన ఏర్పాట్లు కూడా చేశారు. కానీ.. రాజమహేంద్రవరంలో టీడీపీకి ఇప్పుడు ఫ్లెక్సీల వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది.
మహానాడు సందర్భంగా రాజమహేంద్రవరంలో పెద్ద ఎత్తున టీడీపీ నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కానీ.. రాత్రికి రాత్రే ఈ టీడీపీ ఫ్లెక్సీల మధ్యలో వైసీపీ తోరణాలు దర్శనమిస్తున్నాయి. దానికి తోడు వైసీపీ ఎంపీ భరత్ పుట్టినరోజు సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన కటౌట్లు కూడా అలానే ఉండిపోయాయి. దాంతో స్థానిక అధికారులతో మాట్లాడినా.. ఎంపీ భరత్ కటౌట్స్, హోర్డింగ్స్‌ని తొలగించేందుకు వారు నిరాకరిస్తున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపిస్తున్నారు.
వాస్తవానికి ఎంపీ భరత్ పుట్టినరోజు వేడుకలు మే 12న ముగిశాయి. కానీ ఇప్పటికీ అలానే హోర్డింగ్స్, కటౌట్స్ నగరంలో ఉండటంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలానే కొన్ని చోట్ల ఉద్దేశపూర్వకంగానే టీడీపీ ఫ్లెక్సీలను తొలగించి వైసీపీ జెండా, బ్యానర్లు కడుతున్నారని కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీని కలిసి బుచ్చయ్య చౌదరి, జవహర్, గన్ని కృష్ణ ఫిర్యాదు చేశారు. అలానే మహానాడు జన సమీకరణకి ఆర్టీసీ బస్‌లను అద్దెకి ఇవ్వడం లేదని.. ప్రైవేట్ వాహనాలను ఇచ్చేందుకు ముందుకు వస్తున్న వారిని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని కూడా టీడీపీ ఆరోపిస్తోంది.
వాస్తవానికి ఏపీలో ఈ ఫ్లెక్సీల వివాదం గత కొన్ని నెలలుగా కొనసాగుతూనే ఉంది. నారా లోకేష్ యువగళం పాదయాత్ర, చంద్రబాబు పర్యటన సమయంలో టీడీపీ నేతలు రోడ్డుకి ఇరువైపులా కటౌట్స్, ఫ్లెక్సీలు కడితే.. రాత్రికి రాత్రే మధ్యలో వైసీపీ జెండాలు, తోరణాలు వెలుస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఈ ఆధిపత్య ధోరణి రెండు పార్టీల్లోనూ రోజురోజుకీ పెరిగిపోతోంది.
మహానాడుకి లక్షలాది మంది వచ్చే అవకాశం ఉందని టీడీపీ చెప్తోంది. ఆ సమయంలో టీడీపీ ఫ్లెక్సీల మధ్య ఇలా వైసీపీ ఫ్లెక్సీలు వెక్కిరింపుగా ఉంటే వాటిని తొలగించేందుకు కార్తకర్తలు ప్రయత్నించే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే ఇరువర్గాల మధ్య గొడవ ఖాయం. ఏపీలో పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే? ఎన్నికలు టైమ్‌కి ఈ ఫ్లెక్సీల ఆధిపత్యం ఏ స్థాయికి వెళ్తుందో చూడాలి.