Telugu Global
Andhra Pradesh

కారును ఢీకొన్న లారీ.. ఐదుగురు విద్యార్థులు మృతి.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

స్వామివారి దర్శనానంతరం తిరిగి ఆదివారం రాత్రి చెన్నైకి బయల్దేరారు. తిరువళ్లూరు జిల్లా కనకమ్మసత్రం సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా వేగంగా వచ్చిన లారీ వీరి కారును ఢీకొట్టింది.

కారును ఢీకొన్న లారీ.. ఐదుగురు విద్యార్థులు మృతి.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
X

చెన్నై – తిరుపతి జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లారీ కారును ఢీకొనడంతో ఐదుగురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కనకమ్మ సత్రం సమీపంలో ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నై సమీపంలోని ఎస్‌ఆర్‌ఎం కళాశాలలో ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్న ఏడుగురు విద్యార్థులు రెండు రోజులు సెలవులు రావడంతో శనివారం కారులో తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయానికి వెళ్లారు. స్వామివారి దర్శనానంతరం తిరిగి ఆదివారం రాత్రి చెన్నైకి బయల్దేరారు. తిరువళ్లూరు జిల్లా కనకమ్మసత్రం సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా వేగంగా వచ్చిన లారీ వీరి కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. కారులో ఉన్న ప్రొద్దుటూరుకు చెందిన నితీష్‌ (21), తిరుపతికి చెందిన యుగేశ్‌ (23), చేతన్‌ (22), కర్నూలుకు చెందిన రామోహ్మన్‌ (21), విజయవాడకు చెందిన బన్ను నితీష్‌ (22) ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు.

నెల్లూరుకు చెందిన విష్ణు, ప్రకాశం జిల్లా వాసి చైతన్యకు ఈ ఘటనలో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని తిరువళ్లూరు ప్రభుత్వ ఆస్ప‌త్రికి తరలించారు. కారులో చిక్కుకుపోయిన మృతదేహాలను పోలీసులు అతికష్టం మీద బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కనకమ్మ సత్రం పోలీసులు ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల బంధువులకు సమాచారం అందించామని వారు వెల్లడించారు.

First Published:  12 Aug 2024 7:35 AM IST
Next Story