ఆ ఉద్యోగులకు 5 రోజుల పనిదినాలు పొడిగింపు
రాజధాని ప్రాంత పరిధిలోని రాష్ట్ర సచివాలయం, సెక్షన్ ఇన్‌చార్జిల కార్యాలయాలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ ఐదు రోజుల పనిదినాల వెసులుబాటు వర్తిస్తున్న విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి రాజధాని ప్రాంత పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల పనిదినాలు వారానికి ఐదు రోజులు మాత్రమే ఉండేలా ప్రభుత్వం అవకాశమిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానిని మరో ఏడాది పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఆదేశాలిచ్చారు.
రాజధాని ప్రాంత పరిధిలోని రాష్ట్ర సచివాలయం, సెక్షన్ ఇన్‌చార్జిల కార్యాలయాలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ ఐదు రోజుల పనిదినాల వెసులుబాటు వర్తిస్తున్న విషయం తెలిసిందే. దీనిని పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన చీఫ్ సెక్రటరీ.. విధుల సమయం ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అని అందులో పేర్కొన్నారు.
ఉద్యోగుల సమస్యలపై గ్రీవెన్స్
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రతి నెలా మూడో శుక్రవారం ఫిర్యాదుల పరిష్కార దినం నిర్వహించాలని చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు ఇచ్చారు. జిల్లా కలెక్టర్లు, విభాగాధిపతులు, ఉద్యోగులు ఇచ్చే ఫిర్యాదులు, వినతులను 'జగనన్నకు చెబుదాం' పోర్టల్‌లో నమోదు చేయాలని ఆయన సూచించారు.