అమరావతి అసైన్డ్ భూముల స్కాంలో ఐదుగురు అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అసైన్డ్ భూముల స్కాంలో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. కొల్లి శివరాం, గట్టెం వెంకటేష్, చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయులు, కొట్టి దొరబాబులు అరెస్టైన వారిలో ఉన్నారు. వీరంతా మాజీ మంత్రి నారాయణకు దగ్గరి బంధువులు, సన్నిహితులుగా చెబుతున్నారు.
అమరావతి భూ కుంభకోణంలో కీలక అరెస్ట్‌లు జరిగాయి. ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అమరావతిలో మొత్తం 1100 ఎకరాల అసైన్డ్ భూముల కుంభకోణం చేసినట్టు సీఐడీ చెబుతోంది. ఇందులో ప్రస్తుతం అరెస్ట్ అయిన ఐదుగురు 169 ఎకరాల అసైన్డ్ భూమిని కొట్టేశారు. మాజీ మంత్రి నారాయణ ఒక్కరే 89 ఎకరాల భూములు తీసుకున్నారు. ఈ భూ లావాదేవీలకు రామకృష్ణ హౌసింగ్ డైరెక్టర్ ఖాతా నుంచి నిధులు మళ్లించినట్టు సీఐడీ తేల్చింది.
నారాయణకు, రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు మధ్య 15 కోట్ల రూపాయల లావాదేవీలు గుర్తించారు.కొల్లి శివరాం, గట్టెం వెంకటేష్, చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయులు, కొట్టి దొరబాబును అరెస్ట్ చేశారు. వీరిలో కొందరు వైజాగ్‌లో ఉండగా సీఐడీ పోలీసులు పట్టుకున్నారు. వీరంతా మాజీ మంత్రి నారాయణకు బంధువులు, సన్నిహితులుగా చెబుతున్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా మాజీ మంత్రి నారాయణ పేరును సీఐడీ చేర్చింది. ఇదివరకే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్లో నారాయణపై కేసు నమోదు అయింది. దాంతో హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు.