Telugu Global
Andhra Pradesh

నాలుగో తేదీ ఖాయమా..?

చంద్రబాబు ఇద్దరు అభ్యర్థులను ప్రకటిస్తే, జనసేన పోటీచేయబోయే రెండు నియోజకవర్గాలను పవన్ ప్రకటించారు. ఈ ప్రకటనలకే రెండుపార్టీల్లోనూ చాలా గొడవలవుతున్నాయి.

నాలుగో తేదీ ఖాయమా..?
X

ఈనెల 4వ తేదీన జరగాల్సిన రెండు బహిరంగ సభలను పార్టీల అధినేతలు రద్దు చేసుకున్నారు. దాంతో రెండు పార్టీల్లోనూ అభ్యర్థుల ప్రకటనపై ఉత్కంఠ పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఈనెల 4వ తేదీన చంద్రబాబు, పవన్ బహిరంగ సభలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇద్దరు కూడా సడన్ గా సభలను రద్దు చేసుకున్నారు. కారణం ఏమిటంటే.. ఆరోజే అభ్యర్థుల ఉమ్మడి మొదటి జాబితా విడుదలయ్యే అవకాశాలున్నట్లు ప్రచారం పెరిగిపోతోంది. రాబోయే ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్థుల జాబితాను ఇంతవరకు అధికారికంగా ఉమ్మడిగా ప్రకటించలేదు.

చంద్రబాబు ఇద్దరు అభ్యర్థులను ప్రకటిస్తే, జనసేన పోటీచేయబోయే రెండు నియోజకవర్గాలను పవన్ ప్రకటించారు. ఈ ప్రకటనలకే రెండుపార్టీల్లోనూ చాలా గొడవలవుతున్నాయి. ఒకవైపు జగన్మోహన్ రెడ్డేమో అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు. మరోవైపు టీడీపీ-జనసేన పార్టీల్లో టికెట్ల విషయంలో గందరగోళం పెరిగిపోతోంది. ఇంకోవైపు నోటిఫికేషన్ జారీ అవబోతోందనే ప్రచారంతో పై రెండుపార్టీల నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. అందుకనే రెండుపార్టీల్లోని నేతలు చంద్రబాబు, పవన్ పైన అభ్యర్థుల ప్రకటనపై బాగా ఒత్తిడి పెంచేస్తున్నారు.

ఆ ఒత్తిడిని తట్టుకోలేకే చివరకు అభ్యర్థుల ప్రకటనకు ఇద్దరు అధినేతలు సిద్ధపడ్డారు. అందుకనే ఈనెల 4వ తేదీని ముహూర్తంగా పెట్టుకున్నారని రెండుపార్టీల్లో ప్రచారం పెరిగిపోతోంది. ఎల్లోమీడియా ప్రకారం ఇప్పటికే రెండుపార్టీలు పోటీచేయబోయే నియోజకవర్గాల సంఖ్య, నియోజకవర్గాలు డిసైడ్ అయిపోయాయి. కాకపోతే వివిధ కారణాల వల్ల అధికారికంగా ప్రకటన చేయలేదంతే. అధినేత ప్రకటన ఆలస్యమయ్యే కొద్దీ రెండుపార్టీల నేతలు గగ్గోలు పెట్టేస్తున్నారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో టీడీపీ తరపున బుద్ధా వెంకన్న, జలీల్ ఖాన్, జనసేన తరపున పోతిన మహేష్ గొడవలు పెరిగిపోతున్నాయి.

అలాగే రాజోలు, రాజానగరం నియోజకవర్గాల్లో రెండుపార్టీల నేతల మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి. టికెట్లు తమకు అంటే కాదు తమకే అని రెండుపార్టీల నేతలు చేసిన గందరగోళం కారణంగానే మొన్న చంద్రబాబు వేదికమీద నుండి కిందపడబోయారు. ఇక రాజమండ్రి, తిరుపతి లాంటి చాలా నియోజకవర్గాల్లో రెండుపార్టీల నేతల మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి. అందుకనే గొడవలు మరింత పెరిగిపోయి రోడ్డునపడి కొట్టుకోకుండా 4వ తేదీన మొదటిజాబితాను ప్రకటించబోతున్నట్లు టాక్ వినబడుతోంది. మరి ఏమి జరుగుతుందో చూడాలి.

First Published:  3 Feb 2024 10:42 AM IST
Next Story