Telugu Global
Andhra Pradesh

టీచర్ల ఆన్ లైన్ అటెండెన్స్ లో తొలిరోజే సమస్యలు..

అయితే తొలిరోజే సవాలక్ష సందేహాలతో స్కూళ్లకు వచ్చిన ఉపాధ్యాయులు కాసేపు యాప్ తో కుస్తీ పడ్డారు. చివరకు అటెండెన్స్ వేయలేక పాత పద్ధతిలోనే రిజిస్టర్ లో సంతకాలు పెట్టారు.

టీచర్ల ఆన్ లైన్ అటెండెన్స్ లో తొలిరోజే సమస్యలు..
X

ప్రభుత్వ స్కూళ్లలో ఉపాధ్యాయుల హాజరు విషయంలో ఏపీ సర్కారు కొత్త సంస్కరణలు తీసుకొచ్చింది. ఫేస్ క్యాప్చరింగ్ టెక్నాలజీతో ఈరోజు నుంచే కొత్త అటెండెన్స్ విధానం అమలులోకి తెచ్చింది. అయితే తొలిరోజే ఈ ప్రయోగం విఫలమైనట్టు తెలుస్తోంది. సాంకేతిక సమస్యల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు ఇబ్బంది పడ్డారు. ఆన్ లైన్ లో అటెండెన్స్ వేయలేకపోయారు. యాప్‌ డౌన్‌ లోడ్‌ కాకపోవడం, డౌన్ లోడ్ అయినా.. అటెండెన్స్ తీసుకోకపోవడంతో అధికారులు ఈరోజు వరకు మినహాయింపు ఇచ్చారు.

సెల్ఫీ అటెండెన్స్..

ఉదయాన్నే స్కూల్ కి వెళ్లే ఉపాధ్యాయులు సెల్ఫీతో ముందు తమకు తాము అటెండెన్స్ వేసుకోవాలి. ఒకవేళ సమయానికి రాలేకపోతే హాఫ్ డే లీవ్ పెట్టుకోవాల్సిందే. సాయంత్రం తిరిగి వెళ్లేటప్పుడు కూడా హాజరు ఇలాగే నమోదు చేసుకోవాలి. అయితే తొలిరోజే సవాలక్ష సందేహాలతో స్కూళ్లకు వచ్చిన ఉపాధ్యాయులు కాసేపు యాప్ తో కుస్తీ పడ్డారు. చివరకు అటెండెన్స్ వేయలేక పాత పద్ధతిలోనే రిజిస్టర్ లో సంతకాలు పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సమస్య తలెత్తడంతో అధికారులు వెనక్కి తగ్గారు.

భవిష్యత్తులో ఎలా..

అధికారులు మాత్రం ఆఫ్ లైన్ సౌకర్యం కూడా ఉందని, ప్రస్తుతానికి ఇంటర్నెట్ లేకపోయినా, సిగ్నల్స్ బాగా వచ్చిన తర్వాత పాత టైమ్ ప్రకారమే అటెండెన్స్ తీసుకుంటుందని అంటున్నారు. కానీ అది ఇక్కడ వర్కవుట్ కావట్లేదని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. పాత పద్ధతిలోనే బయోమెట్రిక్ విధానంలో అటెండెన్స్ తీసుకోవాలని కోరుతున్నారు. గతంలో సిగ్నల్ సమస్య, పరికరాల్లో లోపాల కారణంగా బయోమెట్రిక్ వ్యవస్థలో అటెండెన్స్ తీసుకునే విధానం విఫలమైంది. దీని స్థానంలో తీసుకొచ్చిన ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ కూడా అలాగే తయారైంది. దీనికి ప్రభుత్వం మరిన్ని మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది. కొత్త విధానంతో సెలవులు, ఇతర వ్యవహారాలన్నీ ఆన్ లైన్ అవుతాయని, ప్రత్యేకంగా జీతాలకోసం ట్రెజరీకి వెళ్లే అవసరం ఉండదని అధికారులంటున్నారు. విద్యార్థుల అటెండెన్స్ కూడా ఆన్ లైన్ లోకి వస్తే ఇక అమ్మఒడి వంటి పథకాల విషయంలో హాజరు చూడటం సులభమవుతుందని చెబుతున్నారు. కానీ ప్రాక్టికల్ గా వస్తున్న సమస్యలను మాత్రం పరిష్కరించాల్సి ఉంది.

First Published:  16 Aug 2022 2:39 PM IST
Next Story