Telugu Global
Andhra Pradesh

ఎస్పీ వరకు వెళ్లిన దున్నపోతు పంచాయితీ.. ఇలా పరిష్కరించారు..

ఈ విషయం తెలుసుకున్న రచ్చుమర్రి గ్రామస్తులు ఆ దున్నపోతు తమదంటూ అంబాపురానికి వచ్చారు. తాము కూడా జాతర కోసం గతంలో దున్నపోతును వదిలామని, అంబాపురం గ్రామస్తులు బంధించిన దున్నపోతు తమదంటూ వివాదానికి దిగారు.

ఎస్పీ వరకు వెళ్లిన దున్నపోతు పంచాయితీ.. ఇలా పరిష్కరించారు..
X

ఒక దున్నపోతు కోసం రెండు గ్రామాల ప్రజలు పట్టింపులకు వెళ్లడంతో వివాదం చివరకు ఎస్పీ స్థాయి వరకు వెళ్ళింది. అనంతపురం జిల్లాలో ఈ ఘటన జరిగింది. కనేకల్లు మండలంలోని అంబాపురం, రచ్చుమర్రి గ్రామస్తులు దున్నపోతు తమదంటే తమదంటూ గొడవకు దిగారు.

కొన్ని గ్రామాల్లో సాధారణంగా వచ్చే జాతర కోసం ముందుగానే దున్నపోతుల‌ను తీసుకొచ్చి దాన్ని గ్రామం మీదకు వదులుతుంటారు. ఆ దున్నపిల్లలు గ్రామంలో తిరుగుతూ, పొలాల్లో మేస్తూ పెరుగుతూ ఉంటాయి. జాతర కోసం వదిలిన దున్నపోతులు పంట పొలాల్లో తిరిగినా రైతులు కూడా పెద్దగా అభ్యంతరం తెలపరు. అలా జాతర కోసం వదిలిన దున్నపోతులు ఒక్కోసారి పక్క గ్రామాల్లోకి వెళ్లి తిరుగుతూ ఉంటాయి.

జాతర సమయంలో మాత్రమే వాటిని గ్రామస్తులు తిరిగి తీసుకొస్తుంటారు. ఇదే తరహాలో అంబాపురం గ్రామస్తులు ఐదేళ్ల క్రితం ఒక దున్నపోతును గ్రామం మీదకు వదిలారు. ఈనెల 17న గ్రామంలో జాతర ఉండటంతో బలి ఇచ్చేందుకుగాను పక్క ఊరిలో తిరుగుతున్న దున్నపోతును తీసుకొచ్చి గ్రామంలో కట్టేశారు.

ఈ విషయం తెలుసుకున్న రచ్చుమర్రి గ్రామస్తులు ఆ దున్నపోతు తమదంటూ అంబాపురానికి వచ్చారు. తాము కూడా జాతర కోసం గతంలో దున్నపోతును వదిలామని, అంబాపురం గ్రామస్తులు బంధించిన దున్నపోతు తమదంటూ వివాదానికి దిగారు. రెండు గ్రామాల వారు దున్నపోతు తమదంటే తమదని వాదించుకున్నారు. చివరకు పెద్ద మనుషులు పంచాయితీ నిర్వహించినా ఏ గ్రామస్తులు వెనక్కు తగ్గలేదు. స్థానిక పోలీస్ స్టేషన్ వరకు వ్యవహారం వెళ్ళింది. పోలీసులు చెప్పినా సెంటిమెంట్ పేరుతో గ్రామస్తులు దున్నపోతును వదులుకునేందుకు సిద్ధపడలేదు. దాంతో పోలీసులు కూడా చేతులెత్తేసి విషయాన్ని ఎస్పీ ఫక్కీరప్ప దృష్టికి తీసుకెళ్లారు.

జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో రెండు గ్రామాల వారు ఈ అంశంపై ఫిర్యాదు చేసుకున్నారు. వివాదం రెండు గ్రామాల మధ్య ఘర్షణకు దారి తీయకుండా నివారించేందుకు గాను జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డిఎస్పి, సిఐలు రంగంలోకి దిగారు. చివరకు పోలీస్ అధికారుల సూచన మేరకు గ్రామస్తులు ఒక అంగీకారానికి వచ్చారు. ఈనెల 17న అంబాపురంలో జాతర చేయాల్సి ఉన్నందున ప్రస్తుతం ఉన్న దున్నపోతును ఆ గ్రామస్తులకే అప్పగించేలాగా.. రచ్చుమర్రి గ్రామస్తులు జాతర నిర్వహించడానికి ఇంకా రెండు నెలల సమయం ఉన్నందున ఆలోపు మరో దున్నపోతును సిద్ధం చేసేందుకు గాను అంబాపురం గ్రామస్తులు డబ్బులు సమకూర్చే లాగా పరస్పరం ఒక అంగీకారానికి వచ్చారు.

ఎప్పుడో ఐదేళ్ల క్రితం గ్రామాల మీదకు వదిలిన దున్నపోతు కావడంతో అది ఎవరి దున్నపోతు అని తేల్చడం కష్టమైంది. దాంతో మధ్యే మార్గంగా రెండు గ్రామాల ప్రజలు ఒక ఒప్పందం చేసుకున్నారు.

First Published:  11 Jan 2023 5:07 PM GMT
Next Story