ఏపీలో 4.08 కోట్ల ఓటర్లు.. అత్యధిక ఓటర్లు ఆ జిల్లాలోనే!
రాయలసీమలోని కర్నూలు జిల్లాలో అత్యధిక ఓటర్లు ఉండగా..ఉత్తరాంధ్రలోని అల్లూరి జిల్లా అత్యల్ప ఓటర్లు ఉన్న జిల్లాగా నిలిచింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాను రిలీజ్ చేసింది ఎన్నికల కమిషన్. జిల్లాల వారీగా తుది ఓటర్ల జాబితాను రిలీజ్ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను CEO ANDHRA వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంగా 4 కోట్ల 8 లక్షల 7 వేల 256 ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 2 కోట్ల 9 వేల 275 మంది ఉండగా.. 2 కోట్ల 7 లక్షల 37 వేల 65 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక థర్డ్ జెండర్స్ 3 వేల 482 మంది, సర్వీస్ ఓటర్లు 67 వేల 434 మంది ఉన్నారు.
రాయలసీమలోని కర్నూలు జిల్లాలో అత్యధిక ఓటర్లు ఉండగా..ఉత్తరాంధ్రలోని అల్లూరి జిల్లా అత్యల్ప ఓటర్లు ఉన్న జిల్లాగా నిలిచింది. కర్నూలు జిల్లాలో 20 లక్షల 16 వేల 396 మంది ఓటర్లుండగా..అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 7 లక్షల 61 వేల 568 మంది ఓటర్లు ఉన్నారు. నామినేషన్ల చివరి తేదీ వరకు ఓటర్ల నమోదులో మార్పులు చేర్పులు ఉంటాయని తెలిపింది ఎన్నికల సంఘం. తుది జాబితాపై అభ్యంతరాల స్వీకరణ కోసం ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసింది.
మరోవైపు రాష్ట్రంలో భారీగా నకిలీ ఓట్ల నమోదుతో పాటు అసలు ఓట్ల తొలగింపు జరుగుతోందని వైసీపీ, టీడీపీ పరస్పరం ఈసీకి పలుమార్లు ఫిర్యాదులు చేశాయి. అయితే వీటిలో ఎన్ని ఫిర్యాదులను ఈసీ పరిశీలించిందనేది తెలియాల్సి ఉంది. కలెక్టర్లు జిల్లాల వారీగా విడుదల చేసే జాబితాను పరిశీలించిన తర్వాత రెండు పార్టీలు తుది ఓటర్ల జాబితాపై స్పందించే అవకాశం ఉంది.