నేను పోటీ చేయను - విశాల్.. 2024లో నేను పోటీ చేస్తున్నా- తారక రత్న
తన తండ్రి గ్రానైట్ వ్యాపారంలో ఉన్నప్పుడు మూడేళ్ల పాటు కుప్పంలో ఉన్నారని విశాల్ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో కుప్పంతో తనకు బంధం ఏర్పడిందన్నారు. కుప్పంలో తనకు తెలియని వీధి లేదని, తెలియని మనిషి లేరని చెప్పారు
కుప్పం నుంచి వైసీపీ తరపున నటుడు విశాల్ పోటీ చేయబోతున్నారన్న ప్రచారం కొద్దికాలంగా నడుస్తోంది. ఈ ప్రచారంలో వాస్తవం లేదని మరోసారి ప్రకటించారు నటుడు విశాల్. చెన్నైలో ''లాఠీ'' సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన తన రాజకీయ ఆలోచనలపైనా స్పందించారు. తాను తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానన్నారు. అయితే అది ఎప్పుడు అన్నది ఇప్పుడే చెప్పలేనన్నారు.
కొందరు తాను కుప్పం నుంచి పోటీ చేయబోతున్నట్టుగా.. చంద్రబాబును ఓడించేందుకు విశాలే సరైన అభ్యర్థి అని జగన్ భావించి.. ఇప్పటికే విశాల్‌ను ఒప్పించి, అభ్యర్థిగా ఖరారు చేసినట్టు తప్పుడు ప్రచారం చేశారని, తనకు చంద్రబాబు మీద పోటీ చేసే ఉద్దేశం లేదని అదంతా ఉత్తుత్తి ప్రచారమేనని కొట్టిపారేశారు.
తన తండ్రి గ్రానైట్ వ్యాపారంలో ఉన్నప్పుడు మూడేళ్ల పాటు కుప్పంలో ఉన్నారని విశాల్ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో కుప్పంతో తనకు బంధం ఏర్పడిందన్నారు. కుప్పంలో తనకు తెలియని వీధి లేదని, తెలియని మనిషి లేరని చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో 40 శాతం మంది తమిళులే ఉన్నారన్నారు. ఈ వివరాలను కొందరు లోతుగా తెలుసుకునే తాను అక్కడి నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రచారం చేశారన్నారు. కానీ, పోటీ చేస్తానన్న వార్తల్లో నిజం లేదన్నారు. తనకు చెన్నై ఎంతో కుప్పం కూడా అంతే అని విశాల్ చెప్పారు.
2024లో నేను పోటీ చేస్తా- తారక రత్న
అటు నటుడు తారక రత్న మాత్రం వచ్చే ఎన్నికల్లో ఏపీ నుంచి తాను పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వచ్చిన తారకరత్న.. ప్రజల కష్టాలను తీర్చేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు తాను సిద్ధమైనట్టు చెప్పారు. ఏపీ ప్రస్తుతం సంక్షోభంలో ఉందని, దాని నుంచి బయటపడాలంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన తారకరత్నకు ఉండొచ్చు గానీ.. అంత ఈజీగా చంద్రబాబు టికెట్ ఇస్తారా అన్నదే పెద్ద ప్రశ్న.