Telugu Global
Andhra Pradesh

గుడివాడలో టీడీపీ- వైసీపీ మధ్య ఘర్షణ

రెండు పార్టీల కార్యకర్తలు కర్రలతో కొట్టుకున్నారు. దాడుల్లో ఐదుగురు మీడియా ప్రతినిధులకూ గాయాలయ్యాయి. అడ్డువచ్చిన పోలీసులపైకి ఇరుపార్టీల కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు.

గుడివాడలో టీడీపీ- వైసీపీ మధ్య ఘర్షణ
X

గుడివాడలో ఆదివారం రాత్రి వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. వంగవీటి రంగా వర్ధంతి వేడుకలను నిర్వహించేందుకు వైసీపీ కార్యకర్తలు ఏర్పాట్లు చేయగా... రంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహించే హక్కు వైసీపీకి లేదంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు సమక్షంలోనే ఆయన అనుచరులు అడ్డుపడ్డారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతలను టీడీపీ కార్యకర్తలు బూతులు తిట్టారు. దాంతో వైసీపీ శ్రేణులు ప్రతిఘటించాయి.

ఆ తర్వాత కొడాలి నాని అనుచరుడు కాళీ నేరుగా రావి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి నిన్ను చంపేస్తాన‌ని హెచ్చరించినట్టు టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. దాంతో ఇరు వర్గాలు రోడ్లపైకి వచ్చి గొడవపడ్డాయి. వైసీపీ కార్యకర్తలు కొందరు పెట్రోల్ ప్యాకెట్లు తెచ్చి టీడీపీ ఆఫీస్‌ను తగలబెట్టేందుకు ప్రయత్నించారంటూ టీడీపీ వారు వాదిస్తున్నారు.

రెండు పార్టీల కార్యకర్తలు కర్రలతో కొట్టుకున్నారు. దాడుల్లో ఐదుగురు మీడియా ప్రతినిధులకూ గాయాలయ్యాయి. అడ్డువచ్చిన పోలీసులపైకి ఇరుపార్టీల కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. పోలీసులనూ తోసేశారు. పరిస్థితి అదుపు తప్పటంతో లాఠీచార్జ్ చేసి ఇరుపక్షాలను చెదరగొట్టారు. టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావు మాత్రం వైసీపీ కార్యక్రమాన్ని తాము అడ్డుకోలేదని.. రంగా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించవద్దంటూ తనకే ఫోన్ చేసి కాళీ బెదిరించారని ఆరోపిస్తున్నారు.

First Published:  26 Dec 2022 8:41 AM IST
Next Story