రాజాం టిడిపి సీటు.. మురళీ-గ్రీష్మల మధ్య ఫైటు
తూర్పుకాపు నేతలు, కిమిడి ఫ్యామిలీ ప్రతిభాభారతి లేదంటే ఆమె కుమార్తె గ్రీష్మకి టిడిపి టికెట్ ఇప్పించాలని చూస్తున్నారు. అధిష్టానం అండతో కోండ్రు మురళీ, స్థానిక రాజకీయ నేతలు ప్రోత్సాహంతో గ్రీష్మ రాజాం టిడిపి సీటు కోసం ఫైట్ చేస్తున్నారు.
ఎంతో చరిత్ర కలిగిన రాజాం నియోజకవర్గం సీటు కోసం తెలుగుదేశంలో హాట్ ఫైటు నడుస్తోంది. నిన్న మొన్నటివరకూ స్తబ్దుగా వున్న రాజకీయాలు ఎన్నికలు దగ్గర పడుతున్నాయనే సంకేతాలతో సందడి నెలకొంది. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం కాస్తా కొత్త జిల్లాల ఏర్పాటు సమీకరణాల్లో విజయనగరం జిల్లాలో చేరింది. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైనా.. ఇక్కడ బీసీలైన తూర్పుకాపుల సంఖ్యాపరంగా చాలా ఎక్కువగా వుంటారు. ఏ పార్టీ నుంచి ఎస్సీ అభ్యర్థి పోటీ చేసినా, వెనక ఉండి చక్రం తిప్పేది తూర్పుకాపు నేతలే. గత రెండుసార్లు ఎన్నికల్లోనూ ఇక్కడ టిడిపి టికెట్ ఆశించిన తెచ్చుకున్న ఇద్దరూ స్థానికేతరులే. మాజీ స్పీకర్ ప్రతిభాభారతి 2014 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆమెది ఎచ్చెర్ల నియోజకవర్గం. ఎస్సీ నియోజకవర్గంగా వున్న ఎచ్చెర్ల జనరల్ కావడం, జనరల్ గా వుండే రాజాం ఎస్సీలకి రిజర్వు కావడంతో ప్రతిభాభారతి వలస వచ్చారు.
ఇదే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన కోండ్రు మురళీమోహన్ కూడా ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి వచ్చిన వారే. 2019 ఎన్నికల నాటికి కోండ్రు మురళీ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత ఆయన వైసీపీలో చేరడానికి విశ్వప్రయత్నాలు చేశారు. మూడున్నరేళ్లుగా వైసీపీలో చేరడం సాధ్యం కాకపోవడం, వైసీపీ సర్కారుపై ప్రజావ్యతిరేకత పెరగడంతో మళ్లీ టిడిపి నుంచే రాజాంలో పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. టిడిపి అధిష్టానం కూడా రాజాం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జిగా కోండ్రు మురళీమోహన్ నే ప్రకటించింది.
అయితే అనారోగ్యంతో నియోజకవర్గానికి దూరమైన కావలి ప్రతిభా భారతి కోలుకున్నారు. అలాగే ఆమె కుమార్తె గ్రీష్మ పార్టీలో యాక్టివ్ అయ్యారు. సోషల్‌మీడియాలోనూ ఏదో ఒక రూపంలో కనిపిస్తున్నారు. రాజాం టిడిపి టికెట్ తనకు ఇస్తే గెలిచి చూపిస్తానంటున్నారు గ్రీష్మ. మరోవైపు రాజాం నియోజకవర్గం టిడిపిలో కిమిడి కళా వెంకటరావు రాజకీయం చాలా ప్రభావం చూపుతుంది. కిమిడి ఫ్యామిలీకి కోండ్రు మురళీకి మధ్య గ్యాప్ బాగా ఉంది. నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లుగా వున్న తూర్పుకాపులతో కోండ్రు మురళీకి విభేదాలున్నాయి. నియోజకవర్గంలో గెలిచిన ఎస్సీ ఎమ్మెల్యేలను డమ్మీ చేసి తూర్పుకాపు నేతలు ఆధిపత్యం చెలాయిస్తుంటారు. ఉన్నత విద్యావంతుడు, విద్యాసంస్థల అధిపతి, ఏ క్లాస్ కాంట్రాక్టర్ గా వందల కోట్లు సంపాదించిన కోండ్రు మురళీ మోహన్ కాంగ్రెస్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన స్వతంత్రంగా పనిచేస్తూ తూర్పుకాపు నేతల ఆధిపత్యాన్ని అంగీకరించడు. దీంతో తూర్పుకాపు నేతలు, కిమిడి ఫ్యామిలీ ప్రతిభాభారతి లేదంటే ఆమె కుమార్తె గ్రీష్మకి టిడిపి టికెట్ ఇప్పించాలని చూస్తున్నారు. అధిష్టానం అండతో కోండ్రు మురళీ, స్థానిక రాజకీయ నేతలు ప్రోత్సాహంతో గ్రీష్మ రాజాం టిడిపి సీటు కోసం ఫైట్ చేస్తున్నారు.