ఆపరేషన్ సక్సెస్.. ఐదో చిరుత చిక్కింది..
కర్రల పంపిణీ జరిగిన గంటల వ్యవధిలోనే చిరుత బందీ కావడం విశేషం. ప్రస్తుతానికి ట్రాప్ కెమెరాలకు చిక్కిన చిరుతలన్నీ బోనులో పడ్డాయి. ఎలుగుబంట్లు మాత్రం ఆ జోలికి రావట్లేదు.
ఆపరేషన్ చిరుత ఎట్టకేలకు విజయవంతమైంది. ట్రాప్ కెమెరాల్లో కనపడిన చిరుతలన్నీ బందీలయ్యాయి. ఐదో చిరుత కూడా బోనులో చిక్కడంతో టీటీడీ, అటవీశాఖ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. నరసింహస్వామి ఆలయం, 7వ మైలు మధ్యలో చిరుతని ట్రాప్ చేశారు అటవీశాఖ అధికారులు. ఇప్పటి వరకూ తిరుమల కాలినడక మార్గంలో నాలుగు చిరుతలు పట్టుబడగా, వాటిలో ఒకదాన్ని అడవిలోనే విడిచిపెట్టారు, మిగతా మూడింటిని తిరుపతి జూ పార్క్ కి తరలించారు. తాజాగా ఐదో చిరుత బోనులో చిక్కింది, దీన్ని కూడా జూ పార్క్ కి తరలించబోతున్నారు.
తప్పించుకు తిరిగి..
ఐదో చిరుత సంచారంపై కొన్నిరోజులుగా సమాచారం ఉన్నా అది బోనులో చిక్కడానికి బాగా టైమ్ తీసుకుంది. బోను వద్దకు వచ్చి చాలాసార్లు వెనక్కి వెళ్లిపోయినట్టుగా ట్రాప్ కెమెరాల్లో వీడియోలు రికార్డ్ అయ్యాయి. ఎట్టకేలకు ఆ చిరుత కూడా బోనులోకి వచ్చేసింది. దీనిపై టీటీడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
కర్రలకు భయపడిన చిరుత..!
బుధవారం టీటీడీ చైర్మన్, తిరుమల కాలినడక భక్తులకు చేతి కర్రలు అందించారు. కర్రలను చూసి జంతువులు భయపడతాయని, భక్తుల్లో మానసికస్థైర్యం పెరుగుతుందని చెప్పారాయన. కర్రలపై వచ్చిన విమర్శలను కూడా తిప్పికొట్టారు. కర్రల పంపిణీ జరిగిన గంటల వ్యవధిలోనే చిరుత బందీ కావడం విశేషం. అయితే ఈ ఆపరేషన్ ఇక్కడితో ముగిసిందా లేక మరిన్ని చిరుతలు కాలినడక మార్గంలో ఉన్నాయా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి ట్రాప్ కెమెరాలకు చిక్కిన చిరుతలన్నీ బోనులో పడ్డాయి. ఎలుగుబంట్లు మాత్రం ఆ జోలికి రావట్లేదు. తిరుమల భక్తులకు ఇక భయాందోళనలు అక్కర్లేదని అంటున్నారు సిబ్బంది. ప్రస్తుతం కాలినడక మార్గంలో చిన్న పిల్లల అనుమతిపై మాత్రం నిబంధనలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటిపై సమీక్ష జరగాల్సి ఉంది.