Telugu Global
Andhra Pradesh

అన్న‌దాత‌ల‌కు శుభ‌వార్త‌.. కేర‌ళ‌ను తాకిన నైరుతి రుతుప‌వ‌నాలు

కేర‌ళ తీరాన్ని తాకిన నైరుతి రుతుప‌వ‌నాలు(సౌత్ వెస్ట్ మాన్‌సూన్‌) మ‌రో 3, 4 రోజుల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోకి ప్ర‌వేశిస్తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.

అన్న‌దాత‌ల‌కు శుభ‌వార్త‌.. కేర‌ళ‌ను తాకిన నైరుతి రుతుప‌వ‌నాలు
X

మండే ఎండ‌ల‌తో అల్లాడిపోతున్న జ‌నానికి ఉప‌శ‌మనం క‌లిగించే వార్త‌. అన్నం పెట్టే రైత‌న్న‌కు చల్ల‌టి క‌బురు. నైరుతి రుతుప‌వ‌నాలు దేశంలోకి ప్ర‌వేశించాయి. ఈ రోజు ఉద‌యం అవి కేర‌ళ తీరాన్ని తాకిన‌ట్టు వాతావ‌ర‌ణ శాఖ ప్ర‌క‌టించింది. వ్య‌వ‌సాయ ఆధారిత దేశ‌మైన మ‌న‌కు నైరుతి రుతుప‌వ‌నాల‌తో వ‌చ్చే వాన‌లు అత్యంత కీల‌కం. అందులోనూ ఈసారి నైరుతి ముందే వ‌చ్చి, మంచి వాన‌లు ప‌డ‌తాయ‌న్న వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నాల‌తో అన్న‌దాతలు ఈ వ‌ర్షాల‌పై గంపెడాశలు పెట్టుకున్నారు.

3, 4 రోజుల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోకి..

కేర‌ళ తీరాన్ని తాకిన నైరుతి రుతుప‌వ‌నాలు(సౌత్ వెస్ట్ మాన్‌సూన్‌) మ‌రో 3, 4 రోజుల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోకి ప్ర‌వేశిస్తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. నైరుతి చురుగ్గా క‌దులుండ‌టంతో వ‌ర్షాలు ముందుగానే ప‌డ‌తాయ‌ని అంచ‌నా. భానుడి భ‌గ‌భ‌గ‌ల‌తో బెంబేలెత్తిపోతున్న జ‌నానికి ఇది చ‌ల్ల‌ని కబురే.

స‌గానికి పైగా సాగు వాన నీటితోనే

దేశంలో ఇప్ప‌టికీ 52 శాతం సాగు భూమికి వాన నీరే ఆధారం. దేశంలోని మొత్తం పంట ఉత్ప‌త్తిలో 42 శాతం ఈ భూభాగం నుంచే ల‌భిస్తోంది. ముఖ్యంగా వ‌రికి ఈ వర్షాలు చాలా కీల‌కం. ఈ నేప‌థ్యంలో నైరుతి రుతుప‌వ‌నాలు ముందే రావ‌డం, మంచి వాన‌లు ప‌డతాయ‌న్న అంచ‌నాల‌తో అన్న‌దాత‌లు ఆశ‌తో ఉన్నారు. మ‌రోవైపు గ‌త రెండు, మూడేళ్లుగా స‌రైన వాన‌లు ప‌డ‌క నోళ్లు తెరిచిన బోర్ల‌కు మంచి వాన‌లు ప‌డితే కాస్త ఉప‌శ‌మ‌నం క‌ల‌గ‌నుంది.

First Published:  30 May 2024 7:35 AM GMT
Next Story