Telugu Global
Andhra Pradesh

మోదీకి మరోసారి సెగ పెట్టబోతున్న టికాయత్

స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులు అమలు చేసే వరకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని అన్నారు రాకేష్ టికాయత్. దేశవ్యాప్తంగా కార్పొరేట్‌ వర్గాలు, రైతుల నుంచి భూములు లాక్కుంటున్నాయని మండిపడ్డారు.

మోదీకి మరోసారి సెగ పెట్టబోతున్న టికాయత్
X

ఢిల్లీ సరిహద్దుల్లో నిలబడి ప్రధాని మోదీకి చెమటలు పట్టించిన ఘనుడు రాకేష్ టికాయత్. రైతు చట్టాలను వెనక్కు తీసుకునే వరకు పోరాటం ఆపేది లేదంటూ ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలను మోహరించి, మోదీ వెనక్కి తగ్గేలే చేశారు. తప్పు ఒప్పుకుని నల్ల చట్టాలను వెనక్కి తీసుకునేలా చేశారు. టికాయత్ మళ్లీ ఉద్యమ బాట పట్టారు. మార్చి 20న ఢిల్లీ వేదికగా రైతు పోరాటం నిర్వహించబోతున్నట్టు తెలిపారు. కిసాన్ సంయుక్త్ సంఘ్ ఆధ్వర్యంలో రైతు సమస్యల పరిష్కారానికి ఈ రైతు పోరాటం నాంది పలుకుతుందన్నారాయన.

విజయవాడలో రైతు గర్జన..

ప్రాంతం, భాషలు వేరైనా రైతుల కష్టం, కన్నీళ్లు ఒక్కటేనన్నారు రాకేష్ టికాయత్. విజయవాడలో జరిగిన రైతు గర్జన సదస్సులో పాల్గొన్నారాయన. కేంద్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సాగుచట్టాల రద్దుకోసం జరిగిన పోరాటంలో ఏపీ రైతులు కూడా ముఖ్య భూమిక పోషించారని గుర్తు చేశారు. దేశంలో ఏ పంటకూ గిట్టుబాటు ధరలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాశ్మీర్‌లో యాపిల్‌ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, మార్కెట్‌లో మాత్రం కిలో యాపిల్‌ రూ.500లకు కొనుగోలు చేయాల్సి వస్తోందని, మధ్యలో సొమ్మంతా దళారీలపాలేనని చెప్పారు.

స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులు అమలు చేసే వరకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని అన్నారు రాకేష్ టికాయత్. దేశవ్యాప్తంగా కార్పొరేట్‌ వర్గాలు రైతుల నుంచి భూములు లాక్కుంటున్నాయని మండిపడ్డారు. పదేళ్ల తర్వాత దేశంలో డీజిల్‌ వాహనాలు లేకుండా చేసే కుట్ర జరుగుతోందని టికాయత్‌ అనుమానం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ గోపాలగౌడ, సీపీఎం నేత మధు, సినీనటుడు ఆర్.నారాయణ మూర్తి.. రైతు సంఘాల నేతలు విజయవాడలో జరిగిన రైతు గర్జనలో పాల్గొన్నారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకించారు. పోరాట పంథా ఎంచుకోవాల్సిందేనన్నారు.

First Published:  12 Feb 2023 9:40 PM IST
Next Story