పవన్ కల్యాణ్ అభిమాని దారుణ హత్య.. చంపింది ఎవరంటే..?
హరికుమార్ ని పోలీసులు ఏలూరులో అరెస్ట్ చేశారు. వాట్సప్ స్టేటస్ దగ్గరే గొడవ మొదలైందని చెప్పాడు హరికుమార్.
సినీ హీరోల అభిమానులు ఇటీవల సోషల్ మీడియాలో ఫైటింగ్ కి దిగుతున్న ఉదాహరణలు చాలానే ఉన్నాయి. ఒకరిపై ఒకరు తిట్ల వర్షం కురిపించుకుంటారు, కులాల వారీగా విడిపోతారు. దురభిమానంతో హద్దుమీరి మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలతో కామెంట్లు చేసుకుంటున్న ఘటనలు కూడా చూస్తూనే ఉన్నాం. అయితే ఇవన్నీ సోషల్ మీడియాకే పరిమితం. కానీ ఇప్పుడు వేర్వేరు హీరోల అభిమానులిద్దరూ నేరుగా కలసి తిట్టుకోవడంతో గొడవ ముదిరి చివరకు హత్యకు కారణమైంది. ఈ దారుణ ఘటన పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో జరిగింది.
హీరో ప్రభాస్ కి వీరాభిమాని హరికుమార్. హీరో పవన్ కల్యాణ్ వీరాభిమాని కిషోర్. వీరిద్దరూ ఏలూరుకి చెందినవారు. పెయింటింగ్ పనికోసం అత్తిలి మసీదు సెంటర్ కి వచ్చారు. ఓ భవనానికి పెయింట్ వేస్తూ, రాత్రిళ్లు అక్కడే ఉండేవారు. ఈ క్రమంలో గతరాత్రి ఇద్దరి మధ్య హీరోల గురించి చర్చ వచ్చింది. మా హీరో గొప్పవాడంటే, కాదు మా హీరో గొప్ప అనే వాదన జరిగింది. వాట్సప్ స్టేటస్ లు పెట్టుకునే విషయంలో కూడా గొడవ జరిగింది. అయితే అప్పటికే వారు మద్యం మత్తులో ఉన్నారు. ఇద్దరూ తిట్టుకున్నారు కొట్టుకున్నారు. ఈ గొడవలో ప్రభాస్ అభిమాని హరికుమార్.. పవన్ అభిమాని కిషోర్ ని హత్య చేశాడు. సెంట్రింగ్ కర్రతో తలపై కొట్టి, సిమెంట్ రాయి మొహంపై వేయడంతో అక్కడికక్కడే చనిపోయాడు కిషోర్.
ప్రభాస్ అభిమాని చేతిలో పవన్ అభిమాని హతం..
హరికుమార్ ని పోలీసులు ఏలూరులో అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో జరిగిన గొడవ అని, ఉద్దేశపూర్వకంగా తానీ హత్య చేయలేదని అంటున్నాడు హరికుమార్. రాత్రి ఏం జరిగిందో పోలీసులకు వివరించాడు. వాట్సప్ స్టేటస్ దగ్గరే గొడవ మొదలైందని చెప్పాడు. ప్రభాస్ వీడియోని స్టేటస్ గా పెట్టుకోవద్దనడంతోపాటు, ప్రభాస్ ని కిషోర్ తిట్టాడని, అందుకే కోపంలో చంపేశానని పోలీసులకు హరికుమార్ చెప్పినట్టు తెలుస్తోంది.