ఆశాలు, అంగన్వాడీలు, వాలంటీర్లకు యాత్ర-2 ప్రచార బాధ్యతలు..?
ప్రతి వాలంటీర్ తమ పరిధిలో 10 మందిని సినిమాకు తీసుకురావాలని, దానికోసం అవసరమైన ఏర్పాట్లను, ఆ 10 టికెట్లు వారికి అందించే బాధ్యతను కలెక్టర్లకు అప్పజెప్పినట్టుగా జీవోలో ఉంది.
ఏపీ రాజకీయాల్లో యాత్ర-2 సినిమా హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియా అంతా ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది. సినిమా హిట్ అని తటస్థులు కూడా చెబుతున్నారు, టీడీపీ అనుకూల వర్గం మాత్రం ఈ సినిమాపై వ్యతిరేక ప్రచారం మొదలు పెట్టింది. ఈ వ్యతిరేక ప్రచారానికి రాజకీయ రంగు పులిమి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యవహారాలు కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఓ ఫేక్ జీవో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
యాత్ర-2 ప్రచార బాధ్యతలను, ఆ సినిమాని హిట్ చేసే బాధ్యతను ఏపీ ప్రభుత్వం.. ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, వాలంటీర్లపై పెట్టిందనేది ఆ ఫేక్ జీవో సారాంశం. వారంతా ఈ సినిమాను మొదటిరోజు చూసేలా జిల్లా కలెక్టర్లను చీఫ్ సెక్రటరీ ఆదేశిస్తున్నట్టుగా ఫేక్ జీవోని సృష్టించారు. ప్రతి వాలంటీర్ తమ పరిధిలో 10 మందిని సినిమాకు తీసుకురావాలని, దానికోసం అవసరమైన ఏర్పాట్లను, ఆ 10 టికెట్లు వారికి అందించే బాధ్యతను కలెక్టర్లకు అప్పజెప్పినట్టుగా జీవోలో ఉంది. అంతేకాదు సినిమా కలెక్షన్ల రిపోర్ట్ ని కూడా జిల్లా కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించాలని కూడా ఫేక్ జీవోలో పేర్కొన్నారు. ఇంతా చేసి ఆ ఫేక్ జీవోని మాజీ సీఎస్ నీలం సాహ్ని పేరుతో విడుదల చేయడం ఇక్కడ గమనార్హం.
రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా విషయంలో వైసీపీ నేతలు కాస్త ఎక్కువగా స్పందించినా.. యాత్ర-2 సినిమా రిలీజ్ టైమ్ లో మాత్రం సంయమనం పాటించారు. సినిమాపై ఎక్కడా పార్టీ ముద్ర లేకుండా వ్యవహరించారు. చిత్ర యూనిట్ కూడా ఎక్కడా వైసీపీ సపోర్ట్ అడగలేదు. వైరి వర్గాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు. సినిమాలో కూడా రాజకీయ ప్రత్యర్థులను మరీ కించపరిచే సన్నివేశాలు లేవు. అందుకే ఈ సినిమా వైసీపీ అభిమానులతో పాటు తటస్థులకు కూడా బాగా నచ్చిందని అంటున్నారు. సినిమా హిట్ అవడాన్ని జీర్ణించుకోలేకపోతున్న టీడీపీ బ్యాచ్ ఇలా ఫేక్ జీవోలతో ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తోందనే ఆరోపణలు వినపడుతున్నాయి.