విజయవాడలో నకిలీ సర్టిఫికెట్ల దందా - గుట్టు రట్టు చేసిన పోలీసులు
ఆ సర్టిఫికెట్లతో ఇటీవల బాధితులు పోస్టాఫీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేయగా, అవి ఫేక్ అని బయటపడింది. పోలీసుల విచారణలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం గుట్టు రట్టయింది.
పోస్టీఫీసులో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ.. అందుకు గాను పదో తరగతి 97, 98, 99 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనట్టు సర్టిఫికెట్లు సృష్టించేశారు. ఇందుకోసం ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షలు వసూలు చేశారు. సర్టిఫికెట్లు వచ్చిన బాధితులు ఇటీవల పోస్టాఫీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. అధికారుల వెరిఫికేషన్‌లో అవి ఫేక్ అని తేలింది. బాధితులు సర్టిఫికెట్లు ఇచ్చిన అన్నామలై యూనివర్సిటీ సిబ్బందిని సంప్రదించగా, వారు దురుసుగా సమాధానం చెప్పినట్టు తెలిసింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల విచారణలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం వెలుగులోకొచ్చింది.
విజయవాడలో చోటుచేసుకున్న ఈ నకిలీ సర్టిఫికెట్ల దందాకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. కర్నూలు జిల్లా దేవరకోట మండలం పెద్దకోటపాడు గ్రామానికి చెందిన కొక్కు హరిప్రసాద్, బోయ మద్దిలేటి, సుధాకర్, వీరేష్ డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగాల వేటలో ఉన్నారు. వారికి కర్నూలులో నివాసం ఉండే జోళ్ల నాగార్జునతో పరిచయం ఏర్పడింది.
వారికి పోస్టాఫీసులో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పిన నాగార్జున.. దానికి గాను పదో తరగతిలో 97, 98, 99 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్టు మార్కుల లిస్టు, స్టడీ సర్టిఫికెట్, టీసీ తానే ఇప్పిస్తానని, మీరు స్కూల్‌కు వెళ్లాల్సిన అవసరం లేదని నమ్మబలికాడు. ఇందుకు గాను ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షలు చొప్పున రెండు విడతలుగా వసూలు చేశాడు. డబ్బు అందిన మూడు నెలల్లోనే భారత ప్రభుత్వ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్(ఎన్‌వోఎస్) నుంచి పదో తరగతి తాజాగా ఉత్తీర్ణులైనట్టు సర్టిఫికెట్లు బాధితులకు అందజేశాడు.
ఆ సర్టిఫికెట్లతో ఇటీవల బాధితులు పోస్టాఫీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేయగా, అవి ఫేక్ అని బయటపడింది. పోలీసుల విచారణలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం గుట్టు రట్టయింది. విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్ ఎదురుగా ఉన్న అన్నామలై యూనివర్సిటీలో గత కొన్నేళ్లుగా ఈ బాగోతం గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి బాధితులు వేలాదిగా ఉండవచ్చని సూర్యారావుపేట సీఐ జానకిరామయ్య తెలిపారు.