ఇంతకీ మా టికెట్ ఉందా లేదా? టీడీపీ అభ్యర్థుల్లో గుబులు
దెందులూరు, తంబళ్లపల్లె అభ్యర్థుల బీ-ఫారాలను పెండింగులో ఉంచే అవకాశముంది. అనపర్తి స్థానంపై స్పష్టత వచ్చాక ఆ రెండు స్థానాలకు బీ -ఫారాలు ఇవ్వనున్నారు.
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు టెన్షన్ తగ్గట్లేదు. ఎక్కడ చంద్రబాబు తమకిచ్చిన టికెట్ లాక్కుని నచ్చినవాళ్లకు ఇచ్చుకుంటారోనని ఒకటే టెన్షన్. ఉండి, వెంకటగిరి, పాడేరు, మడకశిర, మాడుగుల ఇలా అయిదారు స్థానాల్లో అభ్యర్థులను మార్చబోతున్నారన్న సంకేతాలతో మిగిలిన అభ్యర్థుల్లోనూ గుబులు మొదలైంది. తనకు నచ్చినవారికి టికెట్లిచ్చే క్రమంలో ఇప్పటికే అక్కడ బీజేపీకో, జనసేనకో ఇచ్చి ఉంటే వారిని పక్కనున్న టీడీపీ సీట్లలో సర్దేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. దీంతో అభ్యర్థుల్లో ఆందోళన పతాక స్థాయికి చేరుతోంది.
ఉండిలో రఘురామకృష్ణరాజుకు టికెటివ్వడానికి రంగం సిద్ధమైంది. దీంతో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు హ్యాండిచ్చినట్లే. పెందుర్తి స్థానం జనసేనకు కేటాయించడంతో అక్కడ అవకాశం కోల్పోయిన మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తికి మాడుగుల స్థానాన్నిఇవ్వబోతున్నట్లు సమాచారం. పాడేరు టికెట్‌ను అటు తిప్పి ఇటు తిప్పి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి కేటాయించనున్నారు. మడకశిర నుంచి ఎంఎస్ రాజును బరిలోకి దించబోతున్నారు. వెంకటగిరి స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీప్రియకు ఖరారు చేశారు. అయితే ఇప్పుడు రామకృష్ణనే అభ్యర్థిగా ప్రకటించనున్నారు.
దెందులూరు, తంబళ్లపల్లె అభ్యర్థుల బీ-ఫారాలను పెండింగులో ఉంచే అవకాశముంది. అనపర్తి స్థానంపై స్పష్టత వచ్చాక ఆ రెండు స్థానాలకు బీ -ఫారాలు ఇవ్వనున్నారు. అనపర్తి బీజేపీకి కేటాయించారు. అక్కడ టీడీపీ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పట్టు వీడకపోవడంతో ఆయన్ను బీజేపీలోకి పంపించి, అక్కడి నుంచి పోటీ చేయించబోతున్నారు. దీంతో నామినేషన్ల టైమ్ వచ్చి, ఓ పక్కన నామినేషన్లు పడుతున్నా తమకు టికెట్ ఉందా లేదా అనేది తేలక టీడీపీ అభ్యర్థులు వడదెబ్బకు సొమ్మసిల్లిన వారిలా అయిపోతున్నారు.