బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడన ప్రభావంతో ఏపీ, ఒడిషాలో భారీ వర్షాలు పడే అవకాశం
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్నది. ఇది రాబోయే 12 గంటల్లో ఉత్తర దిశగా కదలనున్నది. క్రమంగా ఈ అల్ప పీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండగా బలపడే అవకాశం ఉన్నది. తర్వాత 24 గంటల పాటు వాయుగుండం తీవ్రత కొనసాగనున్నది. అల్పపీడన ప్రభావంతో ఏపీ, ఒడిషాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది. కోస్తాంధ్రలో చాలాచోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వానలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నది. తీరం వెంట గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నది.
అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో గురువారం రాత్రి నుంచి వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వాన పడుతున్నది. విశాఖలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో గోపాలపట్నం ఇందిరానగర్‌లో ప్రహరీ గోడ కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. జీవీఎంసీ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన తొలిగింపు పనులు చేపట్టింది.