గ్రామ సచివాలయాలు సూపర్ హిట్టేనా?
ఏపీలో అమలవుతున్న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్ధను యావత్ దేశంలో అమలు చేస్తే జనాలకు నాణ్యమైన సేవలు అందించవచ్చని నిపుణుల కమిటీ కేంద్రానికి సిఫారసు చేసింది.

జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రిస్టేజిగా అమలు చేస్తున్న గ్రామ సచివాలయ వ్యవస్ధ సూపర్ హిట్టయ్యిందా? సాక్షి దినపత్రిక చెప్పిన ప్రకారం చూస్తే వ్యవస్ధ సూపర్ హిట్టనే అనుకోవాలి. ఎందుకంటే ఏపీలోని గ్రామ సచివాలయ వ్యవస్ధను దేశమంతా అమలు చేయాలని 32 మంది నిపుణుల కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిందట. ఎనిమిది రాష్ట్రాల్లో పర్యటించిన నిపుణుల బృందం ఏపీలో అమలవుతున్న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్ధలాంటిది ఎక్కడా అమలు అవ్వటంలేదన్న విషయాన్ని గమనించిందట.
సచివాలయం వ్యవస్ధ ఏర్పాటు, అమలవుతున్న విధానం, ప్రజలకు అందిస్తున్న సేవలు, ఉద్యోగుల పనితీరు, బాధ్యతలు, జీతాలు తదితరాలపై నిపుణుల బృందం అధ్యయనం చేసింది. పంచాయితీరాజ్ వ్యవస్ధను జనాలకు చేరువ చేయటంలో భాగంగా అమల్లోకి వచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్ధ జనాల్లో ఆదరణ పొందినట్లు నిపుణులు గ్రహించారు. ఈ వ్యవస్ధ ద్వారా సుమారు 500కి పైగా సేవలను సిబ్బంది జనాలకు అందిస్తున్న వైనాన్ని గమనించింది.
ఈ వ్యవస్ధ అమల్లోకి రావటం వల్ల వివిధ ప్రభుత్వ శాఖల్లో అవినీతి తగ్గటంతో పాటు సేవలు అందించటంలో వేగం పెరిగిందని నిపుణులు గ్రహించారు. గతంలో నేరుగా శాఖల ద్వారా జనాలకు సేవలు అందాలంటే నెలల తరబడి పట్టేది. ఇపుడు రోజుల్లోనే జనాలకు అవసరమైన సేవలు అందుతున్న విషయాన్ని కమిటి తెలుసుకున్నదట. కాబట్టి ఏపీలో అమలవుతున్న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్ధను యావత్ దేశంలో అమలు చేస్తే జనాలకు నాణ్యమైన సేవలు అందించవచ్చని నిపుణుల కమిటీ కేంద్రానికి సిఫారసు చేసింది.
తాజాగా నిపుణుల సిఫారసు ప్రకారం చూస్తే సచివాలయ వ్యవస్ధ సూపర్ హిట్టనే అనుకోవాలి. అలాగే ఈ వ్యవస్ధే జగన్ ప్రభుత్వానికి భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడనుంది. ఇలాంటి వ్యవస్ధలో పనిచేస్తున్న వలంటీర్లపై చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియా బాగా నెగిటివ్‌గా ప్రచారం చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ వ్యవస్ధను ఫెయిల్ చేయటానికి ఎల్లో బ్యాచ్ ఎంతగా ప్రయత్నించినా జనాలు ఆదరించటంతో ఏమీచేయలేక చివరకు మాట్లాడటమే మానేశారు.