జగన్ నెత్తిన మంత్రులే చెత్తేస్తున్నారా?
బుగ్గన చేసిన వ్యాఖ్యలు జగన్ మెడకు చుట్టుకున్నాయి. ప్రతిపక్షాలతో పాటు ఎల్లో మీడియా జగన్‌ను రెండు రోజులుగా వాయించేస్తున్నాయి. జగన్ ఒక మాట చెబితే మంత్రులంతా ఫాలో అవ్వాల్సిందే కదా. జగన్ చెప్పినదానికి బుగ్గన చెప్పిందానికి చాలా తేడా ఉండటంతో జనాల్లో కూడా కన్ఫ్యూజన్ పెరిగిపోతోంది.
ప్రతిపక్షాలంటే ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడానికే ఉన్నాయి. వాటికి వత్తాసు పలుకుతున్న మీడియా ఇప్పటికే ఎల్లో మీడియాగా పాపులరైపోయింది కాబట్టి అది కూడా జగన్మోహన్ రెడ్డిపైన బురద చల్లేస్తుంటుంది. సరే ఇదంతా జనాలకు కూడా అలవాటైపోయింది. మరి మంత్రులకు ఏమైంది? కొందరు మంత్రులు కూడా నోటికొచ్చింది మాట్లాడేసి జగన్ నెత్తిన చెత్త వేస్తుండటాన్ని ఏ విధంగా అర్ధంచేసుకోవాలి. బెంగుళూరు సదస్సులో రాజధానిపై ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయి.
జగన్ ఏమో మొదటి నుండి మూడు రాజధానులుంటాయని చెబుతున్నారు. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతే కంటిన్యూ అవుతుందని స్పష్టంగా ఎన్నోసార్లు చెప్పుంటారు. మరిపుడు జగన్ ప్రతిపాదనకు విరుద్ధంగా బుగ్గన ఎలా మాట్లాడారు? బుగ్గన ఏమన్నారంటే విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఉంటుందని చెప్పారు. అలాగే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఉంటుందని, అమరావతి అసెంబ్లీలో ఒక సెషన్ నడుస్తుందన్నారు.
జగనేమో కర్నూలులో హైకోర్టే ఏర్పాటు చేస్తామని చెబితే బుగ్గనేమో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పటం ఏమిటి? హైకోర్టుకు హైకోర్టు బెంచ్‌కు తేడాలేదా? అలాగే శాసన రాజధానిగా అమరావతే కంటిన్యు అవుతుందని జగన్ చెప్పిన తర్వాత బుగ్గన ఒక సెషన్ నడుస్తుందని చెప్పటమేంటి? మూడు రాజధానుల గురించి జగన్ అంత స్పష్టంగా ప్రకటన చేసిన తర్వాత కూడా బుగ్గన తన ఇష్టంవచ్చినట్లు తాను ఎలా మాట్లాడుతారు?
బుగ్గన చేసిన వ్యాఖ్యలు జగన్ మెడకు చుట్టుకున్నాయి. ప్రతిపక్షాలతో పాటు ఎల్లో మీడియా జగన్‌ను రెండు రోజులుగా వాయించేస్తున్నాయి. జగన్ ఒక మాట చెబితే మంత్రులంతా ఫాలో అవ్వాల్సిందే కదా. జగన్ చెప్పినదానికి బుగ్గన చెప్పిందానికి చాలా తేడా ఉండటంతో జనాల్లో కూడా కన్ఫ్యూజన్ పెరిగిపోతోంది. పైగా జగన్ చెప్పిందాన్ని అందరు తప్పుగా అర్థం చేసుకున్నారని మంత్రి చెప్పటమేంటి? ఏదేమైనా వివిధ సందర్భాల్లో రోజా, సీదిరి అప్పలరాజు, ధర్మాన, జయరాం లాంటి వాళ్ళు అత్యుత్సాహంతో చేస్తున్న వ్యాఖ్యలు జగన్ నెత్తిన చెత్తేస్తున్నట్లుగా ఉంది.