Telugu Global
Andhra Pradesh

ఎమ్మెల్యేగారి తాలూకా ఆరోపణలు..

ఫలితాలు వచ్చేలోగా పిఠాపురంలో వైసీపీ, జనసేన నేతలు చేస్తున్న హడావిడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఎమ్మెల్యేగారి తాలూకా ఆరోపణలు..
X

"పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా".. అంటూ సోషల్ మీడియాలో జనసైనికులు చేస్తున్న హడావిడి చూస్తూనే ఉన్నాం. ఇప్పుడాయన తాలూకా అయిన టీడీపీ నేత వర్మ.. వైసీపీ అభ్యర్థి వంగా గీతపై తీవ్ర ఆరోపణలు చేశారు. కాకినాడ ఈఎస్ఐ ఆస్పత్రిలో ఒక్కో ఉద్యోగానికి వంగా గీత రూ.10లక్షలు తీసుకున్నారని ఆరోపించారు వర్మ. అలా 30 మంది దగ్గర డబ్బులు వసూలు చేశారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అవినీతిపై విచారణ మొదలు పెడతామని తేల్చి చెప్పారు వర్మ.

ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ఈ ఉద్యోగాల కుంభకోణం జరిగిందని అంటున్నారు వర్మ. కోడ్ అమలులో ఉండగా.. కాకినాడ ఈఎస్ఐలో ఉద్యోగాల నియామకం ఎలా జరిగిందని ప్రశ్నించారు. కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, వంగా గీత ఈ అవినీతికి సూత్రధారి అని చెప్పారు. ఫలితాలు వచ్చే టైమ్ లో వర్మ చేసిన ఈ ఆరోపణలు పిఠాపురంలో సంచలనంగా మారాయి.

పిఠాపురంలో పోరు హోరాహోరీగా సాగింది. ఎవరు గెలిచినా మెజార్టీ నామమాత్రంగా ఉంటుందని అంటున్నారు. అయితే ఫలితాలు వచ్చేలోగా పిఠాపురంలో వైసీపీ, జనసేన నేతలు చేస్తున్న హడావిడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మేం పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా అని జనసైనికులు బైక్ లపై స్టిక్కర్లు వేయించుకుంటుంటే.. మేం డిప్యూటీ సీఎంగారి తాలూకా అంటూ వంగా గీత అభిమానులు స్టిక్కర్లు వేయించుకుని తిరుగుతున్నారు. ఈ గొడవ ఇలా ఉంటే.. అటు టీడీపీ నేత వర్మ కొత్త విమర్శలతో చెలరేగిపోతున్నారు. తామే అధికారంలోకి వస్తామని, వచ్చిన తర్వాత వంగా గీత అక్రమాలపై విచారణ మొదలు పెడతామని అంటున్నారు. వర్మ ఆరోపణలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇవ్వాల్సి ఉంది.

First Published:  31 May 2024 11:57 AM GMT
Next Story