Telugu Global
Andhra Pradesh

ఓటమిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

నాసిరకం మద్యం వల్ల మందుబాబులకు తమ ప్రభుత్వంపై విశ్వాసం పోయిందని, వారంతా వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని చెప్పుకొచ్చారు కాసు.

ఓటమిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
X

ఎన్నికల ఫలితాల తర్వాత ఒకరిద్దరు వైసీపీ నేతలు.. కోటరీ కొంప ముంచిందని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఓట్లు పడలేదని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు అందరూ ఈవీఎంలదే తప్పని ఫిక్స్ అయ్యారు, జగన్ మాటల్నే వల్లె వేస్తున్నారు. తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మద్యంపై నెపం నెట్టేశారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమికి నాసిరకం మద్యం కారణం అని చెప్పుకొచ్చారాయన. ఆ వ్యవహారంపై పార్టీ పెద్దల్ని తాను ఎన్నిసార్లు హెచ్చరించినా ఫలితం లేదన్నారు, అందుకే పార్టీ ఓడిపోయిందని తీర్మానించారు మహేష్ రెడ్డి.

2019లో గురజాల నుంచి వైసీపీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచారు కాసు మహేష్ రెడ్డి. ఈ ఎన్నికల్లో టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు చేతిలో 30వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఓటమి తర్వాత చాన్నాళ్లుగా ఆయన మీడియా ముందుకు రాలేదు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో ఓ సంచలన వీడియో విడుదల చేశారు. పార్టీ ఓటమికి ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలే కారణమన్నారు కాసు.

నాసిరకం మద్యం వల్ల మందుబాబులకు తమ ప్రభుత్వంపై విశ్వాసం పోయిందని, వారంతా వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని చెప్పుకొచ్చారు కాసు. ఇక టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన కొందరు ఎమ్మెల్యేలు చంద్రబాబుని బూతులు తిట్టారని, అలా వారు అవమానించారు కాబట్టే టీడీపీ శ్రేణులు కసి పెంచుకుని విజయం కోసం పనిచేశాయన్నారు. చంద్రబాబు అరెస్ట్ కూడా ఆ పార్టీ గెలుపుకి పరోక్ష కారణంగా నిలిచిందన్నారు. వైసీపీ ఓటమిపై సమీక్ష చేపడతామని, అసలు కారణాలు వెదికి పట్టుకుంటామన్నారు కాసు.

First Published:  23 Jun 2024 10:35 AM GMT
Next Story