Telugu Global
Andhra Pradesh

అమరావతి యాత్రలో కండువాల పండగ - పేర్ని నాని..

అమరావతి పేరుతో జరుగుతున్న పాదయాత్ర టీడీపీ పాదయాత్ర అని ఆరోపించారు పేర్ని నాని. చంద్రబాబు నేరుగా వస్తే ప్రజల్లో సానుభూతి రాదని.. అందుకే బినామీలతో యాత్ర చేయిస్తున్నారని విమర్శించారు.

అమరావతి యాత్రలో కండువాల పండగ - పేర్ని నాని..
X


అప్పటి వరకూ టీడీపీ నేతలు పసుపు కండువాలు కప్పుకొని కనిపిస్తూ, సడన్ గా అమరావతి యాత్రలోకి ఎంటరై కండువాలు మార్చేసి ఆకుపచ్చ కండువాలు కప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. అమరావతి యాత్రలో పాల్గొంటున్నవారంతా టీడీపీ నేతలేనని, కానీ వారంతా కండువాలు మార్చి ఆ యాత్రలో రైతుల్లాగా తిరుగుతున్నారని మండిపడ్డారు. కొన్ని ప్రాంతాల్లో టీడీపీ నాయకులు సైతం పాదయాత్రకు దూరంగా ఉంటున్నారని, ఏదో మొహమాటానికి వారికి స్వాగతం పలుకుతున్నారని చెప్పారు. అమరావతి పేరుతో జరుగుతున్న పాదయాత్ర టీడీపీ పాదయాత్ర అని ఆరోపించారు నాని.

రాష్ట్రంలో పేదలందరినీ కొట్టి అమరావతిలో ఉన్న డబ్బున్నోళ్లకి పెట్టాలని చంద్రబాబు చూశారని, జగన్ హయాంలో అది జరక్కపోయేసరికి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు పేర్ని నాని. చంద్రబాబు నేరుగా వస్తే ప్రజల్లో సానుభూతి రాదని.. అందుకే బినామీలతో యాత్ర చేయిస్తున్నారని విమర్శించారు. యాత్రతో ఒరిగేదేమీ లేదన్నారు. ఉత్తరాంధ్రపై దండెత్తి వెళ్తామనడం అక్కడి ప్రజలను రెచ్చగొట్టడమేనని వివరించారు.

ఎన్టీఆర్ ని మానసికంగా క్షోభ పెట్టారు..

హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై రాద్ధాంతం చేస్తున్న చంద్రబాబు.. గతంలో ఎన్టీఆర్ ని ఎంతలా మానసిక క్షోభకు గురిచేశారో అందరికీ తెలుసన్నారు పేర్ని నాని. పార్టీ నుంచి ఎన్టీఆర్‌ ను సస్పెండ్ చేశారని చెప్పారు. అసెంబ్లీలో చివరిసారిగా మాట్లాడతానంటూ ఎన్టీఆర్ ప్రాథేయపడినా వినకుండా.. మార్షల్స్‌ ను పెట్టి గెంటించారని.. అప్పట్లో ఆయన్ని అంతలా అవమానించిన చంద్రబాబు ఇప్పుడు కొత్తగా వైసీపీ నేతలు అవమానిస్తున్నారంటూ నాటకాలాడుతున్నారని చెప్పారు. చంద్రబాబు హయాంలో జరిగిన మొదటి మహానాడులో ఎన్టీఆర్ ఫోటో కూడా లేదని, ఆయన చనిపోయిన తర్వాత దండ వేసి ఎక్కడలేని నక్క వినయాలు ప్రదర్శించారని సెటైర్లు వేశారు.

First Published:  24 Sept 2022 9:02 PM IST
Next Story