Telugu Global
Andhra Pradesh

నా కొడుకు ఎమ్మెల్యే అయ్యాక ఇళ్ల పట్టాలిప్పిస్తా

తన కొడుకు ఎమ్మెల్యే అయిన తర్వాత గుమ్మటాల చెరువులో ఇళ్లు కట్టుకున్నవారికి పట్టాలిప్పిస్తానని హామీ ఇచ్చారు నాని. పేదోళ్లు దర్జాగా, ధైర్యంగా బతికేలా చేస్తామన్నారు.

నా కొడుకు ఎమ్మెల్యే అయ్యాక ఇళ్ల పట్టాలిప్పిస్తా
X

ఏపీకి జగన్ మరోసారి సీఎం అవడం ఖాయమని, మచిలీపట్నంకు తన కొడుకు పేర్ని కిట్టు ఎమ్మెల్యే కావడం ఖాయమని చెప్పారు మాజీ మంత్రి పేర్ని నాని. తన కొడుకు ఎమ్మెల్యే అయ్యాక గుమ్మటాల చెరువులో ఇళ్లు నిర్మించుకున్న పేదలందరికీ పట్టాలిప్పిస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం మచిలీపట్నం ఎమ్మెల్యేగా ఉన్నారు పేర్ని నాని, ఈసారి ఆయన తనయుడు పేర్ని కిట్టు ఆ స్థానంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మరోసారి బరిలో నిలవడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. కొడుకు పేర్ని కిట్టు తరపున ప్రచారం చేపట్టిన నాని, ప్రత్యర్థి కొల్లు రవీంద్రపై విమర్శలతో విరుచుకుపడ్డారు.

ఓట్లకోసం కొల్లు రవీంద్ర నీఛ రాజకీయాలకు పాల్పడ్డారని అన్నారు పేర్ని నాని. గత ప్రభుత్వంలో పదవి పోతుందని తెలియగానే పది రోజుల ముందు విలేకరులకు కొల్లు రవీంద్ర ఇళ్ల పట్టాలు ఇచ్చారని, ఎలాంటి సర్వే నెంబర్లు లేకుండానే పట్టాలిచ్చారని, ఆ తర్వాత రికార్డులు మాయం చేశారని చెప్పారు. అనుచరులందరికీ దొంగ పట్టాలు సృష్టించి ఇచ్చిన ఘనుడు కొల్లు రవీంద్ర అని విమర్శించారు. గిరిపురం తుపాను బాధితులకు కొల్లు రవీంద్ర ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేకపోయారని చెప్పారు నాని. గుమ్మటాల చెరువులో ప్రజల దగ్గర డబ్బులు తీసుకుని ఇళ్లు నిర్మించారని, వారికి పట్టాలు ఇవ్వలేకపోయారని అన్నారు.

తన కొడుకు ఎమ్మెల్యే అయిన తర్వాత గుమ్మటాల చెరువులో ఇళ్లు కట్టుకున్నవారికి పట్టాలిప్పిస్తానని హామీ ఇచ్చారు నాని. పేదోళ్లు దర్జాగా, ధైర్యంగా బతికేలా చేస్తామన్నారు. రెండు మూడు రోజులుగా కొల్లు రవీంద్ర ఓటమి భయంతో అధికారులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు నాని. అధికారం లో ఉన్నా లేకపోయినా తమ కుటుంబం ప్రజల పక్షాన నిలబడిందని చెప్పారు. ఇప్పుడు ఆ వారసత్వాన్ని తన కొడుకు కొనసాగిస్తారని.. పేద, మధ్యతరగతి వర్గానికి అండగా నిలబడతారని అన్నారు నాని.

First Published:  15 March 2024 5:09 PM IST
Next Story