Telugu Global
Andhra Pradesh

సూపర్‌–6 ఎప్పుడు అమలు చేస్తున్నారు?

చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరానికి వెళ్లి వచ్చారని, గురువారం అమరావతి ప్రాంతానికి వెళ్లొచ్చారని.. ఇలా కాలక్షేపం చేస్తున్నారు తప్ప హామీల అమలుపై ఎలాంటి స్పష్టతా ఇవ్వడం లేదని కొడాలి నాని విమర్శించారు.

సూపర్‌–6 ఎప్పుడు అమలు చేస్తున్నారు?
X

రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌–6 హామీల అమలు గురించి ఎక్కడా మాట్లాడకపోవడాన్ని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. ఆ హామీలను ఎప్పుడు అమలు చేస్తున్నారని ఆయన నిలదీశారు. గురువారం తాడేపల్లిలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశం అనంతరం కొడాలి నాని విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకూ నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారని, దాని గురించి చంద్రబాబు ఏమీ మాట్లాడటం లేదని కొడాలి నాని చెప్పారు. ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ప్రతి ఇంటికీ ఇస్తామని హామీ ఇచ్చారని, దాని గురించి కూడా మాట్లాడటం లేదని ఆయన తెలిపారు. మహిళలకు ఆర్‌టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీ ఇచ్చారని, దాని గురించి కూడా ఏమీ మాట్లాడటం లేదని ఆయన చెప్పారు. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 50 సంవత్సరాలు దాటిన వారికి పింఛను ఇస్తానని చంద్రబాబు ప్రకటించారని, దాని గురించి కూడా ఆయన మాట్లాడటం లేదని కొడాలి నాని తెలిపారు. 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలిప్పిస్తానని హామీ ఇచ్చారని, ఉద్యోగాలు ఇవ్వలేకపోతే ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చారని, దాని గురించి కూడా మాట్లాడటం లేదని ఆయన చెప్పారు. వచ్చే ఒకటో తేదీకి ఆ పథకాలను ఇస్తారా లేదా అని ఆయన ప్రశ్నించారు.

చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరానికి వెళ్లి వచ్చారని, గురువారం అమరావతి ప్రాంతానికి వెళ్లొచ్చారని.. ఇలా కాలక్షేపం చేస్తున్నారు తప్ప హామీల అమలుపై ఎలాంటి స్పష్టతా ఇవ్వడం లేదని కొడాలి నాని విమర్శించారు. ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీలు అమలు చేసేవరకూ తాము గుర్తుచేస్తూనే ఉంటామని ఆయన చెప్పారు. ఆ హామీలకు పవన్‌ కల్యాణ్‌ కూడా మద్దతు తెలిపారని, కాబట్టి పవన్‌ కూడా వీటిపై సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

రుషికొండలో నిర్మించిన భవనాలు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్మించారని, కానీ అది జగన్‌మోహన్‌రెడ్డి నివాసమని టీడీపీ, ఎల్లో మీడియా దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నాయని కొడాలి నాని విమర్శించారు. ప్రభుత్వం కట్టించిన ఇళ్లలో ఉండాల్సిన ఖర్మ జగన్‌మోహన్‌రెడ్డికి పట్టలేదని ఆయన చెప్పారు. రుషికొండలో అంతర్జాతీయ స్థాయి రాజధానిగా వైజాగ్‌ను తీర్చిదిద్దే ఉద్దేశంతో టూరిస్టులు, వీఐపీల కోసం భవనాలు నిర్మించినట్టు ఆయన తెలిపారు. దొంగ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ, దానిని డైవర్ట్‌ చేయడం కోసం ఈ ఆరోపణలు చేస్తోందని ఆయన మండిపడ్డారు.

First Published:  20 Jun 2024 12:36 PM GMT
Next Story