Telugu Global
Andhra Pradesh

తప్పు చేస్తే నోటీసులివ్వండి.. ఇలా బెదిరిస్తారేంటి..?

విద్యాశాఖపై వచ్చిన విమర్శలకు తాను సమాధానం చెప్పబోనని, ఫైళ్లు వారి దగ్గరే ఉన్నాయని, వారే పరిశీలించుకోవచ్చని చెప్పారు బొత్స సత్యనారాయణ.

తప్పు చేస్తే నోటీసులివ్వండి.. ఇలా బెదిరిస్తారేంటి..?
X

"వైసీపీ కార్యాలయాలకు వెళ్లి టీడీపీ నేతలు పరిశీలించడం ఏంటి..? ఏదైనా పొరపాటు జరిగింది అనుకుంటే నోటీస్ ఇవ్వండి, అంతేకానీ ఇష్టం వచ్చినట్టు పార్టీ ఆఫీస్ లలోకి చొరబడే అధికారం టీడీపీ నేతలకు ఎవరిచ్చారు..?" అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. విజయనగరం జిల్లాలో కూడా ఈ విష సంస్కృతి వచ్చి చేరిందని, ప్రతిపక్ష పార్టీ కార్యాలయానికి వెళ్లి అధికార పార్టీ ఎమ్మెల్యే పరిశీలించడం ఏంటని నిలదీశారాయన. ప్రభుత్వ కార్యాలయాలను వారు పరిశీలించొచ్చు కానీ, ప్రతిపక్ష పార్టీ ఆఫీస్ లలోకి వచ్చే అధికారం వారికి ఎక్కడిదని అన్నారు బొత్స.


యూనివర్శిటీల్లో వైస్ ఛాన్స్ లర్ లను నామినేట్ చేసే విధానంతోపాటు వారి పనితీరు నచ్చకపోతే తొలగించేందుకు కూడా మరో విధానం ఉంటుందని, కానీ టీడీపీ మాత్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు బొత్స. వీసీ కార్యాచరణ నచ్చకపోతే నోటీస్ ఇవ్వవచ్చని, ⁠వీసీ ఆఫీస్‌లోకి వెళ్లి బెదిరించడం, రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం తప్పు అని అన్నారాయన. కావాలంటే ఎంక్వయిరీ కోరారని, అధికారం చేతుల్లో ఉంది కదా అని ఇష్టానుసారం ప్రవర్తించడం సరికాదని హితవు పలికారు బొత్స.

విద్యాశాఖపై వచ్చిన విమర్శలకు తాను సమాధానం చెప్పబోనని, ఫైళ్లు వారి దగ్గరే ఉన్నాయని, వారే పరిశీలించుకోవచ్చని చెప్పారు బొత్స సత్యనారాయణ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తనకు బాగా తెలుసని, పథకాలన్నీ అమలు చేస్తారో లేదో ప్రభుత్వమే నిర్ణయించుకోవాలని చెప్పారు. 50వేల పోస్ట్ లు ఖాళీగా ఉన్నాయని అంచనా వేసి 16వేల పోస్ట్ ల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడమేంటని ప్రశ్నించారు బొత్స.

First Published:  30 Jun 2024 11:48 AM GMT
Next Story