టీడీపీ నేత బండారు అరెస్ట్..
బండారు సత్యనారాయణపై రెండు కేసులు నమోదయ్యాయి. సీఎం జగన్, మంత్రి రోజాని.. ఆయన దూషించినందుకు ఈ కేసులు నమోదయ్యాయి. అనకాపల్లిలో ఆయన్ను అరెస్ట్ చేసిన పోలీసులు గుంటూరు తరలిస్తున్నారు.
టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి నుంచి ఆయన ఇంటి వద్ద హైడ్రామా నడిచింది. పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టారు. ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ నోటీసులివ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు పోలీసులను అడ్డుకున్నారు. ఈరోజంతా తర్జన భర్జన జరిగింది. పోలీసులు తమను బెదిరిస్తున్నారని, బండారు సతీమణి కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయడం గమనార్హం. చివరకు నాటకీయ పరిణామాల మధ్య బండారుకి బేడీలు పడ్డాయి. అనకాపల్లిలో ఉన్న ఆయన్ను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రెండు కేసులు..
బండారు సత్యనారాయణపై రెండు కేసులు నమోదయ్యాయి. సీఎం జగన్, మంత్రి రోజాని.. ఆయన దూషించినందుకు ఈ కేసులు నమోదయ్యాయి. అనకాపల్లిలో ఆయన్ను అరెస్ట్ చేసిన పోలీసులు గుంటూరు తరలిస్తున్నారు. అనకాపల్లి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసిన అనంతరం ఆయన్ను గుంటూరుకి తీసుకొస్తారు. అయితే పోలీసులను టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారిని అడ్డు తొలగించి పోలీసులు ఆయన్ను గుంటూరు తీసుకు రాబోతున్నారు.
కాసేపటి క్రితమే లోకేష్ ఫోన్..
మాజీ మంత్రి బండారుతో కాసేపటి క్రితమే నారా లోకేష్ ఫోన్ లో మాట్లాడారు. ఆయన్ను అరెస్ట్ చేసే పరిస్థితులు ఉండటంతో.. ధైర్యంగా ఉండాలని, పోరాటాన్ని కొనసాగించాలని చెప్పారు. అక్రమ కేసులు పెట్టే పోలీసులకు ఇబ్బందులు తప్పవని అన్నారు లోకేష్. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పోరాటం ఆపేది లేదని లోకేష్ కు బండారు బదులిచ్చారని ఆయన అభిమానులన్నారు. ఆ ఫోన్ కట్ చేసిన కాసేపటికే.. బండారుని పోలీసులు అరెస్ట్ చేయడం విశేషం.