ఆ ప్రచారం అవాస్తవం.. వైసీపీతోనే నా ప్రయాణం.. బాలినేని శ్రీనివాస రెడ్డి
మంచి ఉద్దేశంతో పవన్ చేసిన ట్వీట్ కి రెస్పాండ్ అయ్యా.. ఇక దానితో ఇలాంటి వార్తలు పుట్టుకొచ్చాయి అన్నారాయన. ఎన్ని కష్టాలు వచ్చినా జగన్ వెంటే అని వ్యాఖ్యానించారు.
జనసేన నేతలతో తాను టచ్‌లో ఉన్నట్టు వచ్చిన వార్తలను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఖండించారు. ఎన్ని కష్టాలు వచ్చినా సీఎం జగన్ వెంటే ఉంటానని ఆయన ప్రకటించారు. ఊసరవెల్లి రాజకీయాలు తనకు చేతకాదని, వైసీపీని వీడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఒంగోలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. చేనేతకు సంబంధించి జనసేన నేత పవన్ కళ్యాణ్ తనను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారని, దానికి స్పందించానని చెప్పారు. 'కేటీఆర్, పవన్ ఇద్దరూ కూడా ట్వీట్ చేశారు.. అయితే దానికి నా స్పందనను కొందరు హైలైట్ చేశారు. కావాలనే రెచ్చగొడుతున్నారు' అని ఆయన ఆరోపించారు. మంచి ఉద్దేశంతో పవన్ చేసిన ట్వీట్ కి రెస్పాండ్ అయ్యా.. ఇక దానితో ఇలాంటి వార్తలు పుట్టుకొచ్చాయి అన్నారాయన. ఎన్ని కష్టాలు వచ్చినా జగన్ వెంటే అని వ్యాఖ్యానించారు.
ఏది ఏమైనా ఇలాంటి దుష్ప్రచారాలు బాధాకరమని, రాజకీయాల్లో ఉన్నంత కాలం తనకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ కుటుంబంతోనే ఉంటానని బాలినేని చెప్పారు. 'గతంలో నా మంత్రి పదవిని వదులుకుని మరీ జగన్ వెంట నడిచా.. ఇటీవలి కాలంలో నా పై జరుగుతున్న ఇలాంటి వార్తల గురించి జగన్ తో మాట్లాడతా' అని తెలిపారు. చేనేత కార్మికుల కుటుంబాలకు జగన్ ప్రభుత్వం ఎంతో మేలు చేస్తోందన్నారు. గోరంట్ల మాధవ్ వ్యవహారంలో విచారణ జరుగుతోందని, ఆ ప్రకారం చర్యలు తీసుకుంటారని బాలినేని శ్రీనివాస రెడ్డి చెప్పారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల తెలంగాణ మంత్రి కేటీఆర్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. బాలినేనికి, టీడీపీ అధినేత చంద్రబాబుకు, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కి సవాలు విసిరారు. నేత కార్మికుల ప్రయోజనాల కోసం వారంలో ఒక్కరోజైనా చేనేత వస్త్రాలు ధరించాలంటూ వీరిని నామినేట్ చేశారు.