టీడీపీకి ఎలాంటి ఛాన్స్ ఇవ్వొద్దు.. నెల్లూరు సిటీపై ఫోకస్ పెట్టిన మాజీ మంత్రి అనిల్
మరోసారి నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి గెలవాలని అనిల్ లక్ష్యంగా పెట్టుకున్నారు. స్థానికంగా పార్టీని బలోపేతం చేయడానికి చేరికలపై దృష్టి పెట్టారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ గడప గడప కార్యక్రమంపై చాలా సీరియస్‌గా ఉన్నారు. కొంత మంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని సమీక్షలో వెల్లడించారు. ఇప్పటికే రెండు సార్లు దీనిపై రివ్యూ చేసిన జగన్.. కొంత మంది నిర్లక్ష్యంపై మండిపడ్డారు. వచ్చే ఏన్నికల్లో 175 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టిన జగన్.. అందుకు అనుగుణంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. జగన్ తొలి క్యాబినెట్‌లో మంత్రిగా పని చేసిన అనిల్ కుమార్ యాదవ్.. ప్రస్తుతం కేవలం ఎమ్మెల్యే హోదాలో మాత్రమే ఉన్నారు. ఇటీవల ప్రాంతీయ ఇన్‌చార్జ్ పదవిని కూడా కోల్పోయారు. దీంతో ఆయన తన నియోజకవర్గంపై ఫోకస్ చేస్తున్నారు.
గడప గడపకు కార్యక్రమంలో వెనుకబడిన వారిలో అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు. సీఎం జగన్ కాస్త మందలించడంతో ఆయన నియోజకవర్గంలో యాక్టీవ్ అయ్యారు. మరోసారి నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి గెలవాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. స్థానికంగా పార్టీని బలోపేతం చేయడానికి చేరికలపై దృష్టి పెట్టారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అన్ని సీట్లను వైసీపీ గెలుచుకున్నది. నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్.. అప్పటి మంత్రి నారాయణపై స్వల్ప ఓట్ల తేడాతో గెలిచారు. అయితే, టీడీపీ బలంగా ఉన్న చోట.. బీసీ నాయకుడిగా ఉన్న అనిల్ గెలవడంతో ఆయనకు జగన్ మంత్రి పదవి కట్టబెట్టారు.
ఇక ఇప్పుడు మరోసారి నెల్లూరు సిటీలో విజయం సాధించాలని అనిల్ అనుకుంటున్నారు. మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గ కార్యకలాపాల్లో పెద్దగా పాల్గొనలేదు. ప్రస్తుతం ఎటువంటి పదవి లేకపోవడంతో పూర్తిగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహిస్తూనే.. రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం అవుతున్నారు. గత ఎన్నికల్లో అనిల్‌పై ఓడిపోయిన నారాయణ ప్రస్తుతం నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. అయితే ఎన్నికల్లోపు మళ్లీ ఆయన సెగ్మెంట్‌లో యాక్టీవ్ అవుతారని భావిస్తున్నారు. టీడీపీ టికెట్‌పై ఆయనే పోటీ చేసే అవకాశం ఉంది. అందుకే అనిల్ ఇప్పటి నుంచే నియోజకవర్గంలో పట్టు పెంచుకునే పనిలో పడ్డారు.
నారాయణ బలమైన అభ్యర్థే అయినా.. పార్టీని కనుక క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసే తాను గెలవడం ఖాయమని అనిల్ అంచనా వేస్తున్నారు. వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వైఎస్ జగన్ పాలన, స్థానికంగా చేపట్టిన అభివృద్ధి తప్పకుండా గెలిపిస్తుందని అనిల్ ధీమాగా ఉన్నారు. తెలుగు దేశం పార్టీకి చెందిన టీఎన్‌ఎస్ఎఫ్ నాయకులను తాజాగా పార్టీలో చేర్చుకున్నారు. నగరంలో బలమైన యువ నాయకులుగా గుర్తింపు ఉన్న కనుపూరు సుకేశ్ రెడ్డి, ఆయన అనుచరులు దాదాపు 100 మందిని ఒకేసారి వైసీపీలో చేరేలా అనిల్ ప్రోత్సహించారు.
రాబోయే ఎన్నికల్లోపు టీడీపీని పూర్తిగా బలహీనపరిస్తే తన గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందని అనిల్ భావిస్తున్నారు. నారాయణ ఈ మధ్య కేసులు, అనారోగ్యం కారణంగా నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. మరోవైపు ఆయనకు ప్రత్యామ్నాయంగా సరైన టీడీపీ నాయకత్వం కూడా లేదు. ఇవన్నీ అనిల్‌కు కలిసొచ్చే అంశాలే కావడంతో.. ఆయన మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నారు. టీడీపీలో ఉన్న అనిశ్చితినే తనకు అనుకూలంగా మలుచుకోవాలని, ఆ పార్టీకి ఎలాంటి ఛాన్స్ ఇవ్వొద్దని అనుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి, తిరిగి జగన్ క్యాబినెట్‌లో బెర్త్ కన్ఫార్మ్ చేసుకోవాలని అనిల్ లక్ష్యంగా పెట్టుకున్నారు.