పోలీసులపై మండిపడ్డ మాజీ మంత్రి అనిల్
టీడీపీ దాడులపై తాము ఫోన్ చేసినా పోలీసులు స్పందించలేదన్నారు అనిల్. ఓటమి అక్కసుతోనే టీడీపీ దాడులకు పాల్పడిందని అన్నారు.
ఏపీలో ఎన్నికల వేళ గొడవలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ గొడవల్లో పోలీసులు.. టీడీపీ నేతలకు కొమ్ముకాశారనే ఆరోపణలు వినపడుతున్నాయి. పల్నాడులో ముఖ్యంగా టీడీపీ అరాచకాలకు పోలీసులు అండగా నిలబడ్డారని అంటున్నారు వైసీపీ నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్. టీడీపీ దాడులపై తాము ఫోన్ చేసినా పోలీసులు స్పందించలేదన్నారు. ఓటమి అక్కసుతోనే టీడీపీ దాడులకు పాల్పడిందని అన్నారు అనిల్.
వైయస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుస్తున్నారన్న సంకేతాలు వెళ్లడంతో పల్నాడులో టీడీపీ నేతలు కవ్వింపు చర్యలతో అరాచకాలకు తెగబడ్డారు
— YSR Congress Party (@YSRCParty) May 14, 2024
మాచర్లలో టీడీపీ గూండాలు బరితెగించి విధ్వంసం సృష్టించారు..దాడులపై మేం ఫోన్లు చేసినా పోలీసులు స్పందించలేదు..వాళ్లే అభ్యర్థుల్లా వ్యవహరించారు
-నరసరావుపేట ఎంపీ… pic.twitter.com/NDn4iBDewl
పల్నాడులో విధ్వంసం..
పల్నాడులోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ, వైసీపీ పరస్పరం దాడులకు దిగాయి. ఇక్కడ బాధితులు ఎవరు, రెచ్చిపోయింది ఎవరు..? అని స్పష్టంగా చెప్పలేం కానీ.. వైసీపీ నేతలు మాత్రం తామే బాధితులం అని చెబుతున్నారు. అటు టీడీపీ నేతలు తాము వైసీపీ వాళ్లకి ధీటుగా బదులిచ్చామని చెప్పుకుంటున్నారు. తమ ప్రతాపం చూపించామంటూ సోషల్ మీడియాలో ఎలివేషన్లు ఇచ్చుకుంటున్నారు. అంటే ఒకరకంగా టీడీపీ నేతలు తామే దాడులకు తెగబడ్డామని ఒప్పుకుంటున్నారనమాట. ఇదే విషయంపై అనిల్ కుమార్ యాదవ్ పోలీసులను నిలదీస్తున్నారు. పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా పనిచేశారని అన్నారాయన.
ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదులు చేయడం ద్వారా ఏపీలో చాలా చోట్ల పోలీస్ అధికారుల్ని బదిలీ చేయించింది టీడీపీ బ్యాచ్. ఒకరకంగా అధికారుల్ని బ్లాక్ మెయిల్ చేసింది. నిజాయితిగా పనిచేస్తున్న వారు కూడా కాస్త సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితి. దీంతో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ఈసీ తాము చెప్పినట్టల్లా ఆడుతోందని అత్యుత్సాహం ప్రదర్శించారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తనయుడు, డ్రైవర్‌పై దాడి చేశారు. ముప్పాళ్లలో మంత్రి అంబటి రాంబాబు అల్లుడి కారుని టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. తంగెడలో పెట్రోలు బాంబులతో దాడి చేయడంతో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నిన్న మొన్నటి వరకూ తమపై దాడులు జరిగాయని, తామే బాధితులమంటూ సానుభూతికోసం ప్రయత్నించిన టీడీపీ నేతలు.. ఎన్నికల రోజు తమ ప్రతాపం చూపించారు. పల్నాడులో ఫ్యాక్షన్ రాజకీయాలను తెరపైకి తెచ్చారు.