Telugu Global
Andhra Pradesh

సీట్లు రాకపోయినా మాకు ఓట్లు వచ్చాయి.. అనిల్ కీలక వ్యాఖ్యలు

వైసీపీ కచ్చితంగా గెలుస్తుందని తాను సవాల్ విసిరిన మాట వాస్తవమేనని.. అయితే తన సవాల్ ని ఎవరూ స్వీకరించలేదని, స్వీకరించి ఉంటే ఇప్పుడు సమాధానం చెప్పి ఉండేవాడిని అని అన్నారు అనిల్.

సీట్లు రాకపోయినా మాకు ఓట్లు వచ్చాయి.. అనిల్ కీలక వ్యాఖ్యలు
X

తానెక్కడికీ పారిపోలేదని, ప్రజల మధ్యే ఉంటానని, ఓడిపోయినంత మాత్రాన ఏదో జరిగిపోయినట్టు కాదని, తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతామని ధీమాగా చెప్పారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ప్రజలు వైసీపీకి 40శాతం ఓట్లు ఇచ్చారని, కానీ తమకు సీట్లు మాత్రమే రాలేదన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే పనైపోయిందని అనుకున్నారని, ఈ ఎన్నికల్లో తమకు తక్కువ సీట్లు వచ్చినంత మాత్రాన భవిష్యత్ కూడా ఇలాగే ఉంటుందని అనుకోలేమని చెప్పారు. కచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు అనిల్. ఎప్పటికీ జగన్ వెంటే ఉంటామని, కష్టసుఖాల్లో ఆయనకు తోడుగా ఉంటామని చెప్పారు.


పవన్ పై ఆ వ్యాఖ్యలు నేను చేయలేదు..

పవన్ కల్యాణ్ ని అసెంబ్లీ గేటు తాకనివ్వను అనే వ్యాఖ్యల్ని తాను చేయలేదని అన్నారు అనిల్. గతంలో పవన్ ఓడిపోయారని, ఇప్పుడు గెలిచారని.. అందులో విశేషం ఏమీ లేదాన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం అన్నారు. మంత్రుల నోటిదూల వల్లే వైసీపీ ఓడిపోయిందని కొందరు విమర్శిస్తున్నారని, తమ తప్పులు ఏవైనా ఉంటే కచ్చితంగా సరిదిద్దుకుంటామన్నారు, ప్రజా తీర్పుని గౌరవిస్తామని చెప్పారు అనిల్.

వైసీపీ కచ్చితంగా గెలుస్తుందని తాను సవాల్ విసిరిన మాట వాస్తవమేనని.. అయితే తన సవాల్ ని ఎవరూ స్వీకరించలేదని, స్వీకరించి ఉంటే ఇప్పుడు సమాధానం చెప్పి ఉండేవాడిని అని అన్నారు అనిల్. వైసీపీలో అభ్యర్థుల నియోజకవర్గాలు మార్చడం వల్లే ఓటమిపాలయ్యారనే వాదనను తాను సమర్థించబోనన్నారు అనిల్. నర్సరావుపేటలో పోటీ చేసిన అసెంబ్లీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లకంటే ఎంపీ అభ్యర్థిగా తనకు 40వేల ఓట్లు ఎక్కువగా వచ్చాయన్నారాయన. ప్రజల్లో ఉంటామని, ప్రజలకోసం పోరాటం చేస్తామన్నారు. అధికారంలోకంటే, ప్రతిపక్షంలోనే ఎక్కువకాలం ఉన్నామని.. తనకు ఇలాంటివన్నీ అలవాటేనన్నారు అనిల్. కొత్త ప్రభుత్వం తమ హామీలన్నీ నెరవేర్చాలని, తప్పులు చేస్తే కచ్చితంగా ప్రజల తరపున ప్రశ్నిస్తామని చెప్పారాయన.

First Published:  13 Jun 2024 2:50 PM IST
Next Story