Telugu Global
Andhra Pradesh

అది అర్థం కావడం కష్టం.. కవర్ చేసుకోలేకపోతున్న అంబటి

పోలవరంపై ఆరోపణలు, ప్రత్యారోపణలు, శ్వేతపత్రాలు, వాటికి వివరణలు.. అన్నీ అయిపోయిన తర్వాత మళ్లీ కొత్తగా అంబటి ట్వీట్ వేయడం విశేషం. పోలవరం చంద్రబాబుకి కూడా అర్థం కాలేదంటున్నారాయన.

అది అర్థం కావడం కష్టం.. కవర్ చేసుకోలేకపోతున్న అంబటి
X

మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా ఓ ట్వీట్ వేశారు. కాఫర్ డ్యామ్ లేకుండానే ప్రాజెక్ట్ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అనుకున్నారని, అంటే ఆయనకు ప్రాజెక్ట్ ఇంకా అర్థం కాలేదని ఎద్దేవా చేశారు. అది క్లిష్టమైన ప్రాజెక్ట్ అని ఇదివరకే తాను చెప్పానని, అది అర్థం కావడం కష్టం అని మరోసారి తన ట్వీట్ ద్వారా గుర్తు చేశారు. పోలవరంపై ఆరోపణలు, ప్రత్యారోపణలు, శ్వేతపత్రాలు, వాటికి వివరణలు.. అన్నీ అయిపోయిన తర్వాత మళ్లీ కొత్తగా అంబటి ట్వీట్ వేయడం విశేషం. పోలవరం అర్థం కాదు అని తాను చెప్పిన మాటల్ని సమర్థించుకునేందుకు ఆయన తాపత్రయ పడుతున్నట్టు మాత్రం ఈ ట్వీట్ స్పష్టం చేస్తోంది.


"పోలవరం ప్రాజెక్ట్ అంత తేలిగ్గా అర్థం కాదు, అర్థం కాదని అంత గట్టిగా ఎలా చెబుతున్నానంటే నాకు అర్థం కాలేదు కాబట్టి.." ఈ ఒక్క డైలాగ్ తో ఇటీవల సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ఏపీగా మారారు అంబటి రాంబాబు. అధికారంలో ఉన్నప్పుడెప్పుడూ పోలవరం తనకు అర్థం కాలేదు అని అంబటి చెప్పలేదు. ఇప్పుడు మాత్రం అది అర్థం కాలేదు, అందుకే పూర్తి కాలేదు అంటూ చెబుతున్నారు. ట్రోలింగ్ తర్వాత ఆయన కాస్త ఇబ్బంది పడిన మాట వాస్తవం. అర్థం కాలేదు అంటే తన అర్థం వేరే ఉందని అన్నారు. బాగా స్టడీ చేసిన తర్వాతే ఆ ప్రాజెక్ట్ తనకు అర్థమైందని, అందుకే దాన్ని కట్టడం ఆలస్యమవుతుందని కచ్చితంగా చెప్పానన్నారు అంబటి.

జనాలకు అర్థమైంది..

పోలవరం విషయంలో తప్పెవరిది అనేది జనానికి అనవసరం. ప్రాజెక్ట్ పూర్తయిందా లేదా, పూర్తయితే ఎవరు పూర్తి చేశారనేదే వారికి కావాల్సింది. ఒకవేళ చంద్రబాబు వల్లే ప్రాజెక్ట్ ఆలస్యం అయింది అనుకుంటే.. 2021లో పూర్తి చేస్తాం, 22కి కంప్లీట్ చేస్తాం, 23లో పూర్తి చేసి నీళ్లిస్తాం.. అంటూ వైసీపీ ప్రభుత్వం డెడ్ లైన్లు పెట్టి ఉండాల్సింది కాదు. అధికారంలోకి వచ్చాక డెడ్ లైన్లు పెట్టి మరీ అసెంబ్లీలో సవాళ్లు విసిరిన నేతలు.. చివర్లో చంద్రబాబుదే తప్పు అంటే జనం నమ్మరు కదా. కూటమి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఆలస్యం చేయకుండా పోలవరం ప్రాజెక్ట్ సందర్శించారు. నాలుగేళ్లయినా అది పూర్తి కాదని తేల్చి చెప్పారు. అంటే జనాలకు ఆయన ముందుగానే ఓ క్లారిటీ ఇచ్చేశారు. వైసీపీని పూర్తి స్థాయిలో ఇరుకున పెట్టేందుకు తన వంతు ప్రయత్నం చేశారు. ఇప్పుడు క్లారిటీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వైసీపీది. ఈ క్రమంలో అది క్లిష్టమైన ప్రాజెక్ట్, ఎవరికీ అర్థం కాదు అంటూ సాక్షాత్తూ మంత్రిగా పనిచేసిన నాయకుడే చెప్పడంతో ఆ వ్యవహారం నిజంగానే కామెడీగా మారింది. ఆ వ్యాఖ్యల్ని కవర్ చేసుకోలేక అంబటి తంటాలు పడాల్సి వస్తోంది.

First Published:  30 Jun 2024 5:42 PM IST
Next Story