పవర్ స్టార్ కాదు.. స్ట్రగుల్ స్టార్
రాష్ట్రంలో బలిజలందరూ ఐక్యంగా ఉండి వైసీపీని ఓడించాలని పిలుపునిచ్చారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. పిఠాపురంలో పవన్ గెలుపుకోసం బలిజలంతా ఒక్కటవ్వాలని హితబోధ చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మాజీ సీఎం, ప్రస్తుత రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన రాజకీయాల్లో పవర్ స్టార్ కాదని, ఇంకా స్ట్రగుల్ స్టార్ గానే ఉన్నారని చెప్పారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బలిజల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న నల్లారి, పవన్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఆయన సినిమా కెరీర్, రాజకీయ కెరీర్ కి పోలిక చెప్పారు. సినిమాల్లో స్ట్రగుల్ స్టార్ నుంచి పవర్ స్టార్ గా ఎదిగిన పవన్, రాజకీయాల్లో మాత్రం ఇంకా స్ట్రగుల్ స్టార్ గానే ఉన్నారని అన్నారు. రాజకీయాల్లో ఆయన్ని పవర్ స్టార్ చేయాల్సిన బాధ్యత జనసైనికులపై ఉందన్నారు. ఇంతకీ కిరణ్ కుమార్ రెడ్డి, పవన్ ని పొగిడారో లేక అవమానించారో అక్కడ ఉన్నవారికి అర్థం కాలేదు.
రాష్ట్రంలో బలిజలందరూ ఐక్యంగా ఉండి వైసీపీని ఓడించాలని పిలుపునిచ్చారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. పిఠాపురంలో పవన్ కల్యాణ్ తరపున తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని అన్నారు. తనకోసం రాజంపేట పార్లమెంట్ పరిధిలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని తెలిపారు. పిఠాపురంలో పవన్ గెలుపుకోసం బలిజలంతా ఒక్కటవ్వాలని హితబోధ చేశారు కిరణ్ కుమార్ రెడ్డి.
రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి బలవంతంగా పోటీ చేస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడ వైసీపీ తరపున సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి బలంగా ఉన్నారు. కూటమి తరపున బీజేపీ టికెట్ పై మాజీ సీఎం కిరణ్ బరిలో దిగుతున్నారు. మిథున్ రెడ్డికి ఆయన పోటీ ఇవ్వలేరనే ప్రచారం జరుగుతోంది. దీంతో కులాల వారీగా ఓట్లకోసం ఆయన వ్యూహరచన చేస్తున్నారు. పవన్ పేరు చెప్పి రాజంపేటలో బలిజల ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా అరుదైన ఘనత ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి పాలన విషయంలో మాత్రం ఎక్కడా తన ముద్ర చూపించలేకపోయారు. ఇకప్పటి సీఎం, ఇప్పుడు ఎంపీగా పోటీ చేసేందుకే భయపడిపోతున్నారు.